పుట:కాశీమజిలీకథలు-06.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

కరముగాఁ జేయించెను. దూరదేశమందలి బంధువులను సందోహముగాఁ రాఁ దొడంగిరి. సోమభట్టారకునికిఁ బుత్రిక గలిగిన దనుటయే కాని చూచినవా రెవ్వరును లేరు. బంధువులు నా కపటవధూరత్నమును జూచి ఆహా ! భట్టారకునికి లేకలేక మణి పుట్టినదిగదా ! అతని యదృష్టము మక్కజముగదాయని స్తోత్రములు సేయుచుండిరి. విద్యాభాస్కరుండును వివాహా దివసమున కత్యుత్సాహ ముద్దీపిత మానసుండై సకలబంధు పరివార సహితుండై యయ్య గ్రహారమున కరుదెంచి స్నాతకవ్రతముఁ దీర్చుకొని మహుర్త మున కెదురుచూచుచుండెను.

అంతలో బాస్కరుండు దనవేడిమిం బుడమిపైఁ దప్పించి మందేహాసురలపైఁ బ్రసరింపజేయుటయు విద్యాభాస్కరుఁడు సుముహూర్తమునకుఁ దూర్య నాదములు రోదసీకుహరము నిండ మెండు వైభవముతో నూరేగుచు భట్టారకుని యింటి కరిగెను

కన్యాదాత సత్యవతిఁ బెండ్లి కూతుంజేసి యొక చీకటి గదిలో వియ్యపు గంపలో గూర్చుండఁబెట్టి యెల్లరు చూచునట్లు కపట సత్యవతిని గౌరీతపం బొనరింప నియోగించెను. పెండ్లి కుమారుని బీటలపైఁ గూర్చుండఁబెట్టి పురోహితుండు వివాహ తంత్రమంతయు సమంత్రముగా విధ్యుక్తక్రమంబునఁ గావించి కన్యాదాన కాలమందుఁ బెండ్లి కూతుం దీసికొని వచ్చుటకు గన్యాదాతతోఁగూడ లోపలికిఁ బోయెను. అప్పుడు పరబంధువులందరు లోపలికిఁబోయి గౌరీతపఁ బొనరింపుచున్న యా బాలికారత్నమును జూచి వెరఁగపడుచు నిట్టి చిన్నది విప్రకులంబునఁ బుట్టఁ దగినది కాదనియుఁ జక్రవర్తికి భార్య కాఁదగినదనియు విద్యాభాస్కరుఁ డదృష్టవంతుడనియు బొగడఁ దొడంగిరి.

కన్యాకా పురోహితుం డుచ్చస్వరంబున భట్టారకుని ప్రవరంజదివి యచ్చటి తంత్రంబుదీర్చి వివాహవేదికకుఁ గన్యందీసికొని పోవచ్చునని చెప్పెను. అప్పుడచ్చటివారెల్లఁ బెండ్లి చావడిలోనికిం బోదొడంగిరి. అప్పుడు సోమభట్టారకుండు గంపతోఁగూడఁ బెండ్లి కూతుం జేతులతో నెత్తుకొని యిటునటుచూచి యా చీకటిగదిలోనికిం దీసికొని పోయెను.

వరపురోహితుం డదిచూచి అయ్యా ! అట్లు లోపలికిఁ దీసికొని పోయెదరేల? ఇచ్చటికిఁ దీసికొనిరండని కేకలు వైచెను. కన్యాదాత తొందరపడి యా గంప నచ్చటదింపి యావలకువచ్చి మాలో వివాహమునకు ముందుఁ బెండ్లికూతుం దాచుట యాచారమై యున్నది. అందులకై యిట్లు చేసితినని చెప్పగా ఒక పురోహితుండు యిది వివాహక్రమముగాదు. సుముహూర్తము మిగిలిపోవున్నది. పెండ్లి కొడుకు లేచి రాగూడదు. ఆ వేడుక మరియొకప్పుడు దీర్చుకొనవచ్చునని చెప్పుటయు నొప్పుకొని భట్టారకుండు. అంతకుముందు బోధించియుంచిన యొక యాప్తునితోఁ గన్నెరకం దీసికొనిరమ్మని కనుసన్నఁజేసి తాను వివాహవేదిక యొద్ద కరిగెను.