Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యవతి కథ

85

తలంపు కొనసాగునని చేయఁదలంచికొనిన కృత్యమంతయు బోధించెను. అందుల కనుమోదించుచు గుప్త వర్మ కృతవర్మతో నాలోచించి నాటిరాత్రియే యట్టి వేషము వైచికొనియెను.

చ. గొనబగుమోమునన్బొలయు కుంతలము ల్గలయంగదువ్వి చ
    క్కనిజడవైచి మేలి తేలికన్నులఁ గాటుకదిద్ది రత్నమం
    డనముల నెన్నియేనియు నొడల్మెఱయం ధరియించి లోకమో
    హనమగు కన్నెరూపు వెలయందగె దేశికుఁడిచ్చ మెచ్చగన్.

ఆ మరునాడే పెండ్లి కూతుఁ జూచుటకు విద్యాభాస్కరుండా యగ్రహారమున కరుదెంచి సోమభట్టారకుచే నర్చితుండై పెండ్లికూతుంజూచి మోహక్రాంత స్వాతుండై యిట్లు తలంచెను.

ఆహా ! యీ మోహనాంగి యంగములన్నియు లావణ్యపూరితము లై మొలచినట్లే యొప్పుచున్నవిగదా? అయ్యారే? చేరలకు మీరియున్న యీ తెలి కన్నులసోయగ మెన్నియేండ్లు చూచినను దనివితీరునా ? బాపురే? తళ్కుచెక్కుల యందు మొక్కటియే యొకగ్రంధముగా వ్రాయవచ్చును. ఇట్టి సర్వాంగసుందరిని నాకుఁ పత్నిగాఁజేయఁ బూనిన యీ పండితునిపై ద్వేషమువహించితినిగదా ? శత్రువు లెవ్వరో యీతని కూతురు కురూపిణియని నాకు వ్రాసిరి. దివ్యాంగలంబురడించు మించుబోణి పాణిగ్రహణము సేయుచున్నావాఁడ నా భాగ్యము కొనియాడఁ దగియున్నది. మదీయ పురాకృతము ఫలించినది. నా జన్మము సాద్గుణ్యము నొందినది. నా విద్య సార్ధకమైనది. అని మెచ్చుకొనుచు నుబ్బుచు మురియుచు బెద్దతడవు ప్రహర్ష జలధిలో మునిఁగి యుండెను. అప్పుడు సోమభట్టారకుండు పట్టీ ! సిగ్గేమిటికి ? నీ భర్తను మొగమెత్తి చూడుము. అని గడ్డము పట్టుకొని ముఖమును పైకెత్తి చూపెను.

విద్యాభాస్కరుండు ఆర్యా ? సకలవిద్యచ్చిరోమణులగు మీ పాపకు లోప ముండునా ? బుద్ధులు బోధింపవలయునా? చేష్టలు గరుపవలయునా? లోపలికిఁ దీసికొనివెళ్ళుడు. పాపము సిగ్గుపడు చున్నదని పలికినంత నక్కపటయువతి దిగ్గున లోపలికిఁ బోయినది. విద్యాభాస్కరుండు కాలవ్యవధి సహింపక మామతో ముచ్చటించి ముహూర్తము నిశ్చయించి యింటికి జనియెను.

పిమ్మట సోమభట్టారకుండు లోపలికిఁబోయి గుప్తవర్మఁ గౌగలించుకొని పుత్రా ! మొదటిగండము దాటించితివి నీ వెంతకైనం దగినవాఁడ వగుదువే. కొదువపనిగూడఁ దీర్చితివేని ధన్యుండనగుదు. నీ వేషము మాకే ముచ్చటగలుగఁ జేసినదిగదా? ఈ రహస్యము మనకుఁగాక యెవ్వరికిం దెలియగూడదు సుమీ ? యని పలుకుచు నాటంగోలెఁ బెండ్లి పనులు చేయ మొదలు పెట్టెను.

సోమభట్టారకుండు భాగ్యవంతుఁడగుట నా వివాహ సన్నాహ మాశ్చర్య