84
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
సత్యవతి కథ
వత్సలారా ! వినుండు. మదీయ పురాకృత సుకృత పరిపాక మెట్టిదియో కాని నాకు లేక లేక యొకయాఁడుపిల్ల పుట్టినది. అది మిక్కిలి కురూపిణి యగుటకు మిక్కిలి చింతించుచు దానికి సత్యవతియని పేరు పెట్టితిని. దానిమొగము మసి మంగళముకన్న వికృతముగా నున్నది. ఒడలిచాయకన్న బండికందెన చాయయే మెరుగని చెప్పవచ్చును. కన్న మోహంబున నా కన్నియం బెనుచుచుండ నెనిమిదవ యేట స్ఫోటకము పడినది. అప్పుడొక కన్ను గూడఁ బోయినది. మొగము మరియు వికృతమైనది. తలిదండ్రులకే దానిరూపు మసహ్యముగా నుండును. పెరవారి మాటఁ జెప్పనేల. ఆ సత్యవతి కిప్పుడు వివాహకాలము మించిపోవుచున్నది. రాఁబోవు ననర్థమునకు ముందే ప్రతీకారము సేయవలయునని యూహించి యా సత్యవతి నెన్నఁడును బైటికి రానీయక నితరులు చూడకుండఁ గాపాడుచుంటిని. మదీయ గౌరవము ననుసరించి విద్యాభాస్కరుండును బ్రాహ్మణ కుమారుండు దానిం బరిణయంబగుట కంగీకరించి యరిగెను. నిశ్చయ తాంబూలములు పుచ్చికొంటిమి ముందరి మాసములో వివాహ ముహుర్త ముంచితిమి. ఇట్లుండ నతనికెవ్వరు తెలియఁజేసిరో మీ కుమార్తెను నాఁడు సూచుట మరచితిని. చూచునిమిత్తము నెల్లి వచ్చుచున్నానని కమ్మవ్రాసి యంపెను. ఆ జాబిప్పుడే చూచుకొంటిని. అతండు సత్యవతిని జూచెనేని బెండ్లి యాడనిమాట నిశ్చయము. ఇందుల కెద్దియేని బ్రత్మికియ నాలోచించవలసియున్నదిగదా? నేనొక తెర వాలోచించితి వినుండు. మీ దేశాచార నియమంబులు నా కుపయుక్తములైనవి. స్త్రీలవలె మీరు తలయంతయు శిరోజము లుంచికొంటిని. మరియు మీ మొగములు స్త్రీ ముఖములవలె మనోహరంబులై యున్నవి. కావున మీలో నొకరు స్త్రీ వేషము వైచికొంటిరేని సత్యవతియనిచెప్పి యతనికిం జూపెదను. అతం డప్పుడు పరమ సంతోషముఁ జెందగలడు. పిమ్మట వేరొక తెరవునఁ గార్యంబు సాధించెదనని యావూహ మంతయు వారి కెరింగించిన నవ్వుచు గుప్తవర్మ యిట్ల నియె.
ఆర్యా ! మీ కార్యంబు నెరవేర్చుటకు మేము పూటగాపులమై యుంటిమి. సందియము వలదు. వినుండు పెండ్లి చూపులకును, పీటలపై కూర్చుండుటకును నే నాఁడురూపుధరించి కార్యంబు సాధించెదను. అత్త వారియింట కరిగిన పిమ్మట నదియే నేనని వారిని నమ్మించుటకు యెట్లో తెలియకున్నది. అనుటయు నా విప్రుండు నడుగగా ! గడుసు ప్రశ్నయే వైచితివి. అందులకుకొక యుక్తి నాలోచించితిని వినుము. పెండ్లియైన కొన్నిమాసములకు నా పుత్రి స్పోటకము పడినదని బూటకముపన్ని యా --------------- నిట్టి వికృతరూపము వచ్చినదని ప్రకటించెను. దానంజేసి