పుట:కాశీమజిలీకథలు-06.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృతవర్మ గుప్తవర్మల కథ

83

ఇంతలో సురలతోఁ గూడికొనిన బృహస్పతి వడుపున నొప్పుచు సోమభట్టారకుండు శిష్యులతోఁగూడ దటాకమునుండి కాల్యకరణీయంబులఁ దీర్చికొని యింటికివచ్చెను. వారిజూచి యా విప్రకుమారు లిరువురులేచి నిలువంబడి నమస్కరించిరి. తదీయ రూపవిశేషముల కక్కజముఁ జెందుచు నావిపుఁడు మీ రెవ్వరు? ఎక్కడికిఁ బోవుచున్నారు? మీ యుదంత మెట్టిదని యడిగిన వా రిట్ల నిరి.

దేశికోత్తమా ! మాది దక్షిణదేశము. విద్యార్థులమై వచ్చితిమి. మేము ద్విజకుమారులము. మీరిందు విద్యాదానము సేయుచున్నారని విని యరుదెంచితిమి. మా కోరిక సఫలముఁ గావింపుడు మమ్ము మీ విద్యార్థికోటిలోఁ జేర్చుకొనుడని వినయముగా బ్రార్ధించిన సంతసించుచు నతండు మీ రింతకుముందేమి చదివితిరి. చదువవలసిన గ్రంథములెవ్వి ? మీ యిష్టంవచ్చినట్లు చదువుకొనవచ్చునని నాదరముగాఁ బలికెను. వారును వారుఁ జదివిన విద్యలం బేర్కొని చదువవలసిన వానిం జెప్పినంత విస్మయపడుచు నతండు వారినిఁ గొన్ని విద్యలలాఁ పరీక్షించి తద్విద్యా పరిశ్రమమునకు నమితముగా సంతసించుచు నంతకుముందు తనయొద్దఁ జదువు శిష్యులకు వారినే గురువుగాఁజేసి విద్యలు గరపించుచుండెను. విద్యారహస్యముల వారి కెరింగించుచుండెను. అట్లు శిష్యులు గురువులునై వారు సోమభట్టారకుని యింటఁ గొన్ని దినములు వసించిరి.

ఒకనాఁడు సోమభట్టారకు డక్కుమారుల నిరువురసు రహస్య స్థలమునకుఁ దీసికొనిపోయి వత్సరాలా ! మీరు మత్వామీప్యమునకువచ్చి యల్పకాలమైనను మీ యాశ్రమ నైపుణ్యము విద్యాగుణ గౌరవములు స్తవనీయములై యున్నయవి. మీ యెదుట ననరాదు. మీ రూపములు తేజములు చూచినవారు మీరు పారులని నమ్మఁ జాలరు. చక్రవర్తి కుమారులనియే తలంతురు. మీరు నాచెంత విద్యా విశేషములంతగా గ్రహింపకపోయినను నంతేవాసు లనిపించుకొను చున్నారు. కావున మీరు నాకొక యుపకారము సేయవలసియున్నది. అందులకు నే నుపేక్షించితినేని మీదు మిక్కిలి రాకమానదు. ఉపాయంబునం గాని సాధింపశక్యముకాదు. రహస్య భేద మయ్యెనేని ప్రమాదమువచ్చును. మీ రప్పని పూనికొని దీర్తుమంటిరేని వక్కాణింతునని పలుకుటయు వారువినమ్రులై యిట్లనిరి.

గురువరా ? నీవు తండ్రివోలె నాదరించుచు నింటఁ బెట్టుకొని విద్యలం గఱపుచుంటివి. ఇట్టి యకారణ బంధుండనగు నీయుపకృతి కెన్నడైనఁ బ్రతి జేయగలమా ? నీ యాజ్ఞఁగావించి కృతకృత్యుల మయ్యెదము. సంశయింపక కరణీయములకుఁ గింకరుల మమ్ము నియోగింపుము. ప్రాణప్రదానంబు నైనను గురు కార్యము సవరింతుమని యత్యంతాదరముతోఁ బలుకుచు నా విద్యార్థుల కతం డిట్లనియెను.