Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము


అరువది తొమ్మిదవ మజిలీ కథ

కృతవర్మ గుప్తవర్మల కథ

ఒకనాఁడు అర్ధయామా విశేషదివసకాలంబున మనోహరరూప సంపన్నులగు నిరువురు బ్రాహ్మణ కుమారులు బ్రహ్మస్థలమను నగ్రహార పరిసరంబున నడుచుచు నెదురుపడిన నొక బాటసారిం జూచి అయ్యా ! యిక్కడికిముందు గ్రామ మెంతదూరమున్నది. అందీ రాత్రి నివసింపఁదగిన తావుగలదా యని యడిగిన విని యా మార్గస్థుండు వారింజూచి వెరుఁగుపడుచు నిట్లనియె.

బాలులారా ! మీ రెందలివారలు ? మీ రూపములు కడు సుకుమారములుగా గనంబడుచున్నయవి. మీ ముఖలక్షణంబులు రాజ్య సుఖోపభోగ్యక్షమంబై యున్నవి. ఇట్టి మీరు పాదచారులై నడచివచ్చుట శోచనీయమై యున్నది. గమనాయాసమున స్రుక్కి నడువలేక నడచుచున్నమిమ్ము ప్రశ్నోత్తరములచేఁ క్లేశపరుపరాదుగాని దర్శనీయములైన మీ యాకారచిహ్నములే యీశంకావకాశముఁ గలుగఁ జేయుచున్నవి. మీ ప్రాయము కడుచిన్నది ! మీ వృత్తాంతముఁ గొంతకొంత వివరించి నాకు శ్రోత్రానంద మాపాదింపుడు ఇక్కడికిఁ గడుదవ్వులోనే బ్రహ్మస్థలమను నగ్రహారము కలదు. రవి గ్రుంగకమున్న పోగలరు. కొంచెము విశ్రమింపుఁడు. మీకు భోజనాది సత్కారములు చేయువారందుఁ బెక్కండ్రు కలరు. అని యక్కఁడికథ యంతయుంజెప్పి నిలువంబడియున్న యా తెరువరితో వారిట్లనిరి.

పుణ్యాత్మా ! గ్రామము దాపుననున్నదని మాకుఁ జల్లని మాటలఁ జెప్పితివి. అడుగామడగా నడచుచుంటిమి. మేము బ్రాహ్మణులము. విద్యార్థులమై కాశికరుగుచున్న వారము. మాకు రాజ్యములులేవు పేదపారులము. మృదువులగు మా రూపములే మాకు శత్రువు లగుచున్నవని యుత్తరము సెప్పిరి.

అప్పుడాపాధుండు మీరు నిక్కముగా విద్యార్థులలేని బ్రయాసవడి కాశీ కరుగ నవసరములేదు. ఆ బ్రహ్మస్థలమున సోమ భట్టారకుండను బ్రాహ్మణుడు గలడు. అతండు కాశీపండితుండు. విద్యార్థుల నింటఁబెట్టుకొని విద్యలు గరపు చుండును. వేగము పొండని పలికి యతం డవ్వలికిఁ బోయెను.

పిమ్మట నా కుమారు లిరువురు సూర్యాస్తమయ సమయమునకు నా యగ్రహారమున కరిగి వెదకికొనుచు సోమభట్టారకుని యింటికింబోయి తద్గృహ ---------- బరచిన తాళపత్రకటాసములఁ గూర్చుండిరి.