పుట:కాశీమజిలీకథలు-06.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శీల కళా విద్యా రూపవతుల కథ

79

అప్పుడు యజ్ఞదత్తుండును భార్యయు రాజపుత్రికపయింబడి తల్లీ ! మునిఁగి పోవునప్పుడు నాబిడ్డ యేమని యేడ్చినది. అయ్యో ! మాకేమి చెప్పినది. నిన్నుఁ బెండ్లికూతుం జేసితిమి ఇల్లుకదలవద్దని చెప్పిన నాసఖురాండ్రను దీసికొనివత్తునని చెప్పి బండియెక్కి మా మాట వినిపించుకొనకయే పోయితివిగదా? హా ! పుత్రీ ! హా ! శీలవతీ ! హా ! త్రిలోకసుందరీ ! నాకుఁ బెండ్లి వద్దని నిర్బంధించితివిగదా! ఈ ప్రయత్నము చేయకపోయినను బ్రతుకుదువేమో? అయ్యో ! నా పసికూనా ! నీవిద్యలన్నియు గంగ పాలైనవిగదా? అని తగ్గుణంబు లన్నియు దలంచుకొనుచు దుఃఖింపుచుండిరి.

ధర్మపాలుండు బాలికల కళేబరములు వెదకి తీసికొనిరండని కింకరుల నియమించి యజ్ఞదత్తుని భార్యతోఁగూడ దనయింటికిం దీసికొనిపోయి శోకోపశమనముగా నిట్లనియె.

ఆర్యా ! నీవు ప్రాజ్ఞుండవయ్యుఁ బామరునిభంగినట్లు దుఃఖింపుచుండ మేము చూడలేకుంటిమి వెలుగుఁ జూపి మేఘము పిడుగు విడచినట్లు దై వము ఫల మెరవైచి శోకసముద్రములో ముంచుచుండును. అత్యంతసంతోష సమయంబున నిట్టి వింత తటస్థించిన నెట్టివెతయో యూహింపనలవికాదు. మిమ్మూరడించుటకు మాకు నోరురాకున్నది. గతమునకు వగచుట నిరర్థకముగదా? లోకప్రవృత్తిఁ దెలిసికొని ధైర్యము నవలంబింపుము. సంసార మసారమనియే పెద్దలు నిరసించిరి. కళావతియే శీలవతియని తలంచి మీయింటికిఁ తీసికొనిపొమ్ము. ఎప్పటికైన నా బాలికలు బ్రతికి మరల వస్తారేమో? అట్టికథలు మనము వినియుండలేదా? విధివిలాసములు విచిత్రములుగదా? యని బోధించిన యజ్ఞదత్తుండు కన్నీరుఁ దుడిచికొనుచు నిట్ల నియె.

దేవా ! జీవితాంతమైనను నాశలు బాధింపకమానవు. ఆహా ! నీటిలో రెండుగడియలు మునిఁగియుండినఁ బ్రాణములు నిలువవని యెరింగియు మీమాటలు మదీయ హృదయమున వెఱ్ఱియాసఁ గలిగించుచున్నవి. ఇంతకన్న విచిత్ర మేదియైనంగలదా ? నాయట్టి నికృష్టున కట్టి యదృష్టముపట్టునా? సీ ? మమతామోహము కడుచెడ్డదిగదా? అని యూరక విలపించుచుండ నూరడింపుచు ధర్మపాలుండు కళావతీ రూపవతుల సంతతము నతనియొద్దనుండ నియమించి వారింటి కనిపెను.

యజ్ఞదత్తుండు తద్బాలికా సంభాషణాది విశేషములతో దుఃఖముమరచి కొన్నిదినములు గడిపెను. ఒకనాఁ డా బ్రాహ్మణుఁడు అమ్మా ! కళావతీ ! మీతండ్రి నాకు లోకోపశమనము నిమిత్తము మిమ్ము నాయొద్దనుండ నియమించెను. ఆ కారముచే సాదృశ్యమునం జేసి మిమ్ముఁ జూచినప్పుడల్ల శీలవతి జ్ఞాపకము వచ్చుచున్నది. దానంజే నాదుఃఖము పెరుగుచున్నది. కాని తరుగుటలేదు. విద్యా వ్యాసంగము మాని మీ రిందుండుటఁ బ్రయోజనములేదు. విద్మగఱపుటకు నాకు నో రాడకున్నది. మీ యిరువురు మరియొక యుపాధ్యాయు నొద్ద విద్యలం జదువుఁడు. మేము దేశాంతర