Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

నేమి సెప్పుదును? పాపము పెండ్లికూతుళ్ళిద్దరు సాయంకాలము వేత్రవతీనదిలో జలకమాడుచుండ మొసళ్ళు లాగినవఁట. రాజుగారు మొదలగు వారందరు పోయి వెదకించు చున్నారు.

పెద్ది :- హా ! యెంతకష్టము. నాశాలువులు రెండును నిష్కారణముగా పోయినవిగదా (యని దుఃఖించుచున్నాడు.)

నిగః- తాతా! (నీవు వానికన్న నెక్కుడుగా దుఃఖించుచున్నా వేమిటికి?

పెద్ది:- దుఃఖముకాదా ? ఎంతదూరమునుండి వచ్చితిమి. అబ్బీ ! మాట. ఇరువురకు నేకపుత్రికా విషయముకాదా? విరక్తితో వారిం గురించి యేమైనా దానములు సేయరా? ఆ పర్యవసానము చూచి మరియుఁ బోవుదము.

నిగః- ఛీ ! ఛీ ! అట్టిమాటలిప్పు డాడగూడదు. నీవిక్కడఁ బండు కొనుము. నే నక్కడికిఁబోయి యా వృత్తాంత మంతయుఁ దెలిసికొని వచ్చెద.

అనిచెప్పి నిగమశర్మ వేగముగా వేత్రవతీ నదీతీరమున కరిగెను. ఆ యుపద్రవమువిని పౌరులు వీధులవెంబడి పరుగిడుచున్నారు ధర్మపాల నృపాలుండును బ్రవాసులును బరివారములతో నదియొడ్డున నిలువంబడి కన్నుల నీరుఁగార్చుచుఁ బ్రవాహమువంకఁ జూచుచుండిరి. ప్రవాహమంతయు నావలలో దీపములతో నిండి యున్నది కొందరు వలలు వేయుచున్నారు. మరికొందరు ఓవలఁ బన్నుచున్నారు. ఈతగాండ్రు మునుంగుచున్నారు. గొలుసులు వైచుచున్నారు. మరియు రాజపుత్రికయు రూపవతియుఁ దీరమునఁ గూర్చుండి విచారింపుచుండ ధర్మపాలుండు బుజ్జగింపుచు అమ్మా! ఏడువకుఁడు మీరందరు ఎక్కడ జలకమాడిరి. వారిరువురు నెక్కడ మునిఁగిరి. చెప్పుము. చెప్పుము అని యడుగుచుండ రాజపుత్రిక యిట్లనియి.

మేమందరము సాయంకాలమున మాపూవుఁదోటలో సఖురాండ్రకు రాత్రి వివాహము జరుగునని సంతసముతో నలంకరించుకొనుటకై పూవులుగోసి యలసి మేనంతయుఁ జెమ్మటలు గ్రమ్మ జలక్రీడలాడ నేటిదరి కరుదెంచితిమి. పెండ్లి కూతుండ్రు మాతోఁగూడవచ్చిరి. మీరిప్పుడు జలకమాడగూడదు. దరిఁ గూర్చుండుఁడని మే మెంతఁ జెప్పినను వినక శీలవతియు విద్యావతియు నాశ్రమజలముఁ గడిగికొని యెదమని పలుకుచు జానుదగ్ధమగునీటిలో నిలువంబడి మాదెసఁ జూచుచుండిరి.

అంతలో అమ్మయ్యో? నా పాదమేదియో పట్టికొన్నదని శీలవతి పలుకుచునే మునిఁగినది. విద్యావతి మొసలి మొసలియని యరచుచు నీవలికిఁ రాబోయి నీటిలోఁబడి మునిఁగిపోయినది. అట్లి రువురు మునుఁగుటఁ జూచి మేము గుండెలు బాదికొనుచుఁ గాళులు తడఁబడ గద్గదస్వరముతో నరచుచుఁ బ్రాణములకు వెరువక సాహసముతో నా చెంతకుఁబోయి వెదకితిమి వారిజాడ యేమియుం దెలిసినదికాదు. పిమ్మటనే మీకుఁ దెలియఁ జేసితిమి. అదిగో ! ఆ మూలనే వారు మునింగిరి. అని రాజపుత్రిక యావృత్తాంత మంతయుఁ జెప్పినది.