Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శీల కళా విద్యా రూపవతుల కథ

75

శీల - (సిగ్గుతో) ఎవ్వరినో నిశ్చయించినట్లే చెప్పిరి. ఆమాటలు తెల్లముగా వినంబడలేదు.

కళా — బళాబళ ! మీ పెండ్లిండ్లు కడుచిత్రములుగా నున్నవి. వయసురాక, కన్యకలయిష్టము గొనక, వరునిఁజూపక వారే నిశ్చయించుచున్నా రేమి? వారికిష్టమైన యతఁడు. వీరి కిష్టము కానిచో నేమి సేయవలయును?

శీల — స్వయంవరము రాజులలోఁగాని, బ్రాహ్మణులలో వైశ్యులలోను లేవు. వయసు రాకమున్న తల్లిదండ్రులు నిశ్చయించినవానినే భర్తగా నంగీకరింపవలయునని ధర్మశాస్త్రములలో నున్నదట. మన మ భాగములు చదివితిమి గాని మరచితిమి.

కళా — ఇసిరో యిదియేమి యాచారము? పదియారేడుల వయసు వచ్చు దనుక స్త్రీ బాలయనియే చెప్పబడుచున్నదిగదా? బాలకు భర్తతోఁ బనియేమి? వయసు రాకముందే పెండ్లియాడినఁ బ్రయోజనమేమి? ధర్మశాస్త్రకారకులు బిడ్డలు లేనివారా ఏమి? ఈ లోపల నెవ్వరికైనఁ బ్రమాదము వచ్చిన నేమి సేయనగును.

శీల - నీ మాటలకు నే నేమి సమాధానము చెప్పుదును వినిన మాటలం జెప్పితిగదా ?

కళా — పోనీ ! యది యట్లుండనిండు. మనము నలువురము ఒక్క ప్రాణముగా నుంటిమిగదా? మా యిరువురకుఁ బెండ్లిండ్లుకాకమున్ను మీరు పెండ్లి యాడుట ధర్మమే.

శీల - మే మాడెదమని చెప్పితిమా ఏమి?

విద్యావతి — అక్కలారా! మీ మువ్వురకుఁ బెండ్లియైనపిమ్మట మీ యనుమతి పడిసి నేను బరిణయం బాడెద. ఇందులకుఁ దప్పితినియేని స్త్రీ హత్యా పాపమునకుఁ బాత్రము నగదును

శీల — (నవ్వుచు) కళావతీ ! నీ అభిలాష యెట్టిదో చెప్పుము. అట్లు నడుచుటకు మేమందరము శపధములు సేయగలము.

కళా - మనము నలువురము నేక కాలమందే వివాహమాడవలయునని నా యభిలాష.

రూపవతి — మనలో నెవ్వతెయైనను వరునివరించినఁచో దక్కిన మువ్వుర యనుమతియు వడయవలయును. ఇదియే నియమము. ఇందులకుఁ దప్పితిమేని గాశీలో బ్రహ్మహత్యఁజేసిన పాతకముఁ బొందగలవారము. ఇందులకు బంచబూతములే సాక్షులు అని ఆ మాటకందరు సమ్మతించి శపధములుజేసిరి. అంతటితో నా యుపన్యాసము ముగించి నిష్క్రమించిరి.

మరియొకనాఁడు యజ్ఞదత్తుఁడు పాఠశాలకరుదెంచి యాబాలలకుఁ బాఠములు సెప్పి యనంతరము రాజపుత్రికంజూచి కళావతీ ! నేడుఁ మీకొక శుభోదంత మెరి గించెద నాలింపుఁడు. నీ సఖురాలు శీలవతికి వివాహము నిశ్చయించితిమి. వరుం డను