74
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
గ్రీడాసౌధంబులుగట్టించి యందు వారిని విహరింప నియమించెను. కుసుమకిసలయఫలదళ మనోహరములగు తరులతా విశేషములచే నొప్పారు నప్పూఁదోటలో మణి సౌధంబుల దేవకన్యకలవలె సఖులతో నొక్కసారి గ్రీడింపుచుందురు. పాడుచుందురు. కేరుచుందురు.
ఒకనాఁడు సాయంకాలమున వనవిహారమున నలసి పుష్పాపచయమున డస్సి వేత్రవతీనదిలో జలక్రీడ లాడియాడి వేడుకతో మేడపై గూడుకొని చల్లగాలి సేవింపుచు వారొండొరులిట్లు సంభాషించుకొనిరి.
కళా - అక్కా ! శీలవతీ ! శకుంతసంతానంబులు కోటరంబుల శాఖాంతరంబులఁ గులాయంబులు నిర్మించుకొని యిల్లాండ్రతో బిల్లలతోఁ గాపురములు సేయుచున్నవి. చూచితివా? ఆహా ! ఏమి యీశ్వరమహిమ.
శీల - సఖీ ! పరమేశ్వరుని యద్భుతసృష్టి సామర్ద్య మివియే ప్రకటింపుచున్నవిసుమీ ! మనుష్యులకుంబోలె వీనికిఁ బెండ్లిండ్ల విషయమేమియు వధూవరుల వెదుక నవసరములేదుగదా? మిధునముగానే జనించు చుండును.
విద్యా — అవును. అదియే యుక్తము. తండ్రికొకఁడును తల్లి కొకఁడును గన్యక కొకఁడును ననుకూలుఁడుగా దోచుచుండును. బహుళమందు డెందము సందియ మందక మానదుగదా?
రూప - సత్యము. సత్యము. ఈతఁడే దీనికి బతిగా విధి విధించెనని తెలిసినచో మనసు వ్యభిచరించదు.
కళా — మనుష్యులుమాత్రము స్వతంత్రులాయేమి? నిరూపించినవారినే యిరువరకు నిశ్చయించుకొందురు.
శీల — అది వేదాంతుల యుక్తివచనము. ఆ మాటలు సత్యములని యెట్లు నిశ్చయింపఁగలము.
విద్యా — శాస్త్రములంబట్టి పీటలపైఁ గూర్చుండఁబెట్టిన తరువాత దిరిగి పోయిన పెండ్లిండ్లు కథలు మనమెన్ని వినియుంటిమి.
శీల — సఖులారా ! పెండ్లి యనిన జ్ఞాపకము వచ్చింది మొన్న మాయింట జరిగిన ప్రస్తావము మీకుఁ జెప్ప మరచితిని.
కళా — అది యెట్టిది?
శీల - ధనపాలుఁడు విద్యావతికి నీయేడు పెండ్లిచేయ నిశ్వియించినట మన శీలవతి దానికంటెనించుక పెద్దదిగదా ! ఇంకనుబెండ్లియేల నిశ్చయింపకున్నారు. దొందరపడిన మంచిసంబంధము దొరకునాఅని వివాహకరణాభిలాష సూచింపుచు మాతల్లి తండ్రితో ముచ్చటించినది.
కళా — (విస్మయ నభినయించుచు) ఆమాట కొజ్జలేమనియుత్తర మిచ్చిరి.