70
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
శ్రీరస్తు.
శుభమస్తు - అవిఘ్నమస్తు
కాశీమజిలీకథలు
ఆరవభాగము
అరువదియేడవ మజిలీ.
క. స్వామీ! తిరిగితి నే నీ
గ్రామంబంతయు వింత గాన్పింపదు కా
శ్రీమహిమ విశేషంబుల
వేమేనిం గలిగినేని వెరిఁగింపు దయన్.
గురువరా ! మన మప్పుణ్యక్షేత్రంబునకు కొన్ని దినంబులకుఁ బోఁగలము ? సంతతము తన్మహిమాకర్ణంబున మత్కర్ణంబు లుత్సకములై యుండుంగదాఁ మహాత్మా ! కథారూపంబైన తత్ప్రభావంబొండు మీకు స్ఫురింపదేని నీ వీట నొకచోట నొకవిశేషంబు గంటి. అది నా స్వాంతమున కంతవింతగాఁ దోపకున్నను నుబుసుపోవుటకై యత్తెరం గెరుగఁ గోరుచున్నాను. వినుఁడు. ఇప్పురము తూరుపుదెస నొక యుద్యానవనము కలదు. అందు మనోహరములైన తరులతా విశేషములు పెక్కులు విరాజిల్లుచున్నవి అన్నియు రకమునకు నాలుగు నాలుగు చొప్పున శ్రేణిగా నాటఁబడి యున్నవి. అట్లు ప్రతి గుల్మము చతుసంఖ్యగా వరుసగా నాటుటకుఁ గారణమేదియో యుండకపోదు. అవ్విధ మరసి మన్మనోరధంబుఁ దీర్ప వేడుచున్న వాఁడనని కోరిన విని యమ్మణిసిద్ధుండు సిద్ధమణి మహిమంబున నయ్యుదంత మాకలించుకొని మొగంబున నబ్బురపాటు దోప నిట్లనియె.
వత్సా ! నీయందు దైవసానిధ్యంబుగలదు. నీ వడిగిన ప్రశ్నము లెప్పుడును నద్భుత కథాసందర్భ కలితములై యుండకపోదు. ఇప్పటి నీప్రశ్నములు రెంటికిని నొక్కకథయే యు త్తరముఁ జెప్పగలను. నీవెఱింగినట్లే యడిగితివి. అక్క థ మిక్కిలి చమత్కారభూయిష్టయైయున్నది. సావధాన మనసుండవై వినుమని యిట్లు చెప్పఁ దొడంగెను.