Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చక్రపాణి కథ

69

ముచ్చటింపుచుండెను. చక్రపాణి యొకదెశ నిలువంబడియుండెను రక్షక భటానీతయగు మీనాక్షింజూచి చక్రపాణి యోసీ ! నన్నీ యోగివేషము వైచుకొని యందుఁ గూర్చుండమని ఉపాయము చెప్పినది నీవుకావా? యని యడిగిన న వ్వగలాడి వానిమొగ మెగాదిగఁజూచి యోహో కల్లు ద్రాగితివా ? యేమి ప్రల్లదము లరచుచుంటివి. నీమొగ మెప్పుడైన నేను చూచితినా? చాలు చాలు అని కన్ను లెర్రజేసి పలికినది.

అప్పు డతం డౌరా ! ఎంతమోసకత్తెవే ! నీవు చెప్పనిచో నా కా యుద్యానవనములోని రహస్యములెట్లు తెలియఁబడును స్వయంప్రభాదేవి కోవెల యేమూల నున్నదియో నేనెరుంగుదునా? రాజపుత్రిక యా యోగిని వరించినట్లే నాకుఁ దెలియదు. ఇట్లుచేయమని ఎంతయు నాకు బోధించి నేనేమియు నెరుఁగననిన నూరకపోవునా? నా ముక్కును మొగ మెరుఁగనని చెప్పితివిగదా, నీయింటిలో నావస్తువాహనముల నెన్ని చూపుదునని మరికొన్ని గురుతులుచెప్పి దానిఁదెల్ల బోవునట్లు చేసెను. ఆ మాటలన్నియు విని మీనాక్షియే యీవ్యూహము పన్నినదని సభ్యులు నిశ్చయించిరి.

అట్టి సమయమున స్వయంప్రభకుఁ బుత్రోత్పత్తియైనదని ఎవ్వరో వచ్చి చెప్పిరి. అప్పుడు రాజును మంత్రులును బరమానందభరితులై యపరాధులని నిరూపించియుఁ జక్రపాణిని మీనాక్షినింగూడ నా వేడుకచే శిక్షింపక విడిచి పెట్టించి యందరు నా యుద్యానవనమున కరిగిరి.

సూతికాగృహంబున సహదేవుని ప్రకృతిపలె మెరయుచు దివ్యతేజ స్సంపన్నుఁడై యున్న యాపాపంజూచి యింద్రమ్మిత్రుఁడు ప్రహర్షవారినిధి నీదులాడుచుఁ బీదల కనేక దానములు గావించి తన దేశమంతయుఁ బుత్రోత్సవములు గావింప నియమించెను. తరువాత సహదేవుఁడే యా బాలునికి జాతకర్మ విధులు నిర్వర్తించి దేవదత్తుఁడని పేరు పెట్టెను. ఇంద్రమిత్రుఁడు సహదేవుని యద్భుత సునీషాకౌశల్యమునకు మిక్కిలి సంతసించుచుఁ దన రాజ్యమప్పుడే యాతని యధీనముఁజేసి పట్టభద్రుం గావించెను. సహదేవుండును దమ బంధువులనెల్ల రావించి తండ్రియనుమతిని దన చెల్లెలిని వసుమిత్రునికిచ్చి వివాహముఁ జేయించి యతనిం దనమంత్రిగాఁ జేసికొని యా రాజ్యము సుఖముగాఁ బాలించుచుండెను.

గోపా ! యీపద్య మా స్వయంప్రభను గురించి యప్పటి వారెవ్వరో రచియించి యిందు వ్రాసిరి. స్వయంప్రభ మొదటఁ బెండ్లియాడనని నియమముఁ జేసికొన్నదిగదా. యోగియొకఁడు సహదేవుఁ డొకండు చక్రపాణి యొకఁడు చివరకు నీమువ్వురును మగలుగాఁ దేలిరి. అందులకై యుత్ప్రేక్షించి యీపద్యము రచియింపబడినది అని యెరింగించి మనిసిద్ధుండు శిష్యునితోఁగూడ నా రాత్రియందు వసించి మరునా డవ్వలి యవసథమునకుఁ జేరెను.


శ్రీ శ్రీ శ్రీ