68
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
చక్రపాణి కథ
తల్లీ ! నీ యొద్ద నిక్కము దాచనేల? విను మొకనాఁడు నేను మాధవస్వామి యాలయమునకరిగి పూవులు కోసికొనుచుంటిని. ఆ యర్చకుని యల్లుఁడు చక్రపాణియను నాతఁడు అత్తవారింటికి వచ్చెనట. ఆ వయసుకాఁడు పెరటిలోనికివచ్చి నన్నుఁజూచి తలయూచుచు స్మారవికారములు కొన్ని ప్రకటించెను. కాని వయసును హోయలును రూపమును జూచి భాగ్యవంతుఁడని యేను బ్రమఁజెంది వానితో సరసములాడ మొదలు పెట్టితిని. క్రమంబున నిరువురు మనసులు గలిసినవి. తుద కతండు తన యభిలాష వెల్లడించెను. నే నంగీకరించితిని. నాటంగోలె నిద్దరకు సంబంధము గలిగినది.
కొనియో, దొంగిలించియో కాని యప్పుడప్పుడు నాకు మంచి మంచి పుట్టములు దొడవులునుం దెచ్చి యిచ్చుచుండువాఁడు. ఒకనా డతఁడు నన్నుజూచి నీ పని యెక్కడయని యడిగిన స్వయంప్రభయున్న యుద్యానవనములోనని చెప్పితిని. ఆ రాజపుత్రిక సౌందర్య మెట్టిదని యడిగిన ద్రిలోకాభిరామమని చెప్పితిని. ఆమెం దనకుఁ జూపుమని వేడుకొనియెను. ఆ పని నావలనగాదని ప్రత్యుత్తర మిచ్చితిని. అతండు ప్రతిదిన మందులకే నన్నూరక నిర్బంధించుచుండెను
ఆ తోటలో నెంత రహస్యముగా జరిగిన పనులైనను మాకుఁ దెలియక మానవు. రాజపుత్రిక హేమతో రత్నకూటగిరి కరుగుటయు మూఁడుదినము లందుండుటయు నాయోగిని భర్తగా వరించుటయు లోనగు రహస్యకృత్యము లన్నియు నెప్పటి కప్పుడే మాకుఁ దెలియుచుండినవి. మరియొకనాఁ డాయోగి యెవ్వరికిం జెప్పక యెక్కడికోపోయెను. ఆసంగతి నేను గ్రహించి చక్రపాణితోఁ బరిహాసముగా నీ వా యోగి వేషము వైచికొని యందుఁగూర్చుంటివేని నీ కా రాజపుత్రిక దర్శనము కాఁగలదని చెప్పినంత నతండా సంగతియే నన్ను గ్రుచ్చి గుచ్చి యడుగుటయు స్త్రీ చాపల్యంబునం జేసి యాగుట్టంతయు నతని కెరింగించితిని. తరువాత నతం డవ్వేషము వైచికొని యందుఁ గూర్చుండెను. ఇదియే జరిగినకథ, ఇందు నానేర మేమి యున్నదియో చెప్పుమని పలికిన విని యాదాది యురము మోదికొనుచు నిట్లనియె.
ఇంకనేమి ? దారిఁజూపితివి. తరువాతకృత్యంబులన్నియు నతండు పూరించెను, కానిమ్ము. మించినదానికిఁ జేయునదిలేదు. ఇప్పుడు నీవామాటయేమియు నొప్పుకొనవద్దు నా కేమియుం దెలియదని పలుకుము చక్రపాణి యెవ్వఁడో నే నెరుఁగనని బొంకుము, అని బోధించుచుండఁగనే రాజబటులువచ్చి మీనాక్షి యెందున్నదని పలుకుచు నిల్లు ముట్టడించిరి.
మీనాక్షితల్లి దానిం గొట్టకుండ వాండ్రం బ్రతిమాలికొని మీనాక్షితోఁగూడ వారివెంట న్యాయస్థానమున కరిగినది. అందునింద్రమిత్రుఁడు హితపురోహితమంత్రి సామంతాది ప్రకృతివర్గము సేవింపఁ గొల్వుకూట మలంకరించి సహదేవునితో నేదియో