పుట:కాశీమజిలీకథలు-06.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కపట శివానందయోగి కథ

67

యుత్సవములు సేయించెద. లేనిచో వట్టి పాషాణముగా దలంచెదనని పలుకుచున్న సమయంబున హేమ యెదురుకువచ్చి మహారాజా ! ఆ దేవి నేమియు నిందింపవలదు మీ చింతలన్నియు దొలగిపోయినవి. వెదకఁబోయినరత్నము చేతికే దొరికినది. దైవసంకల్పములు కడుచిత్రములుగదా యని పలుకుచు సహదేవుఁడు చేసిన కృత్యములును సావిత్రి చెప్పినమాటలు నామూల చూడముగాఁ జెప్పినది. ఆ వృత్తాంతము విని రాజును, భార్యయు పరమానందసాగరమున మునిఁగి దేలుచుండిరి.

అని యెరింగించువరకు వేళ యతిక్రమించుటయు నవ్వలి మజలీ యందు మణిమసిద్ధుండు తదనంతరొదంతం బిట్లని చెప్పందొడెంగెను.

అరువది యారవ మజిలీ

పుత్రీ ! మీనాక్షీ ! యిటురా ? యేమిపనిచేసితివి? తరతరంబులనుండి దివాణము నాశ్రయించుకొని యుంటిమిగదా? అంతిపురిలోని రహస్యములు వెల్లడి చేయవచ్చునా? ఇప్పుడు మనజీవికకే హానిఁదెచ్చితివి. గొప్పయపరాధమే నీపైఁ బడినది. మాధవస్వామి యర్చకుఁడు శ్రీనివాసాచార్యుని యల్లుడట, వాఁడెవ్వఁడు? వానితో నీకుఁ బరిచయ మెప్పుడు గలిగినది? అందలి నిజమేదియో చెప్పుము. ఇప్పుడు ముప్పువచ్చినదని యడిగిన తల్లి మాటలు విని యించుక వెరచుచు మీనాక్షియను దాసీపుత్రిక యిట్లనియె.

అమ్మా ! నామీదఁబడిన నేర మెట్టివి? యర్చకుని యల్లునిమాట యేమిటికి వచ్చినది ఏమేమివింటివో యంతయుం జెప్పుమని యడిగిన నా దాది అయ్యో ! నీవేమియు నెరుఁకవు కాఁబోలు ! వినుము, మొన్న నేనుఁగనెక్కి యూరేగివచ్చినయోగి మొదట రాజపుత్రిక వరించిన యోగికాడఁట. సహదేవుండను రాజపుత్రుఁడు వైరాగ్యము జనింప యోగియై యందుఁ దపము జేసికొనుచుండ నాతని మన రాజపుత్రిక వరించి పెండ్లియాడినదఁట. ఆతం డిప్పుడువచ్చి తానే భర్తనని చెప్పెను. అప్పు డిరువురు యోగులకుఁదగవు గలిగినది. స్వయంప్రభ గురుతులన్నియుం దెలిసికొని సహదేవునే వరించితినని చెప్పినది.

అప్పుడా కపటయోగిని రాజభటులు నిజము సెప్పుమని తర్జన భర్జనఁ గావించిరి. దెబ్బలకుఁ దాళక యతండు తాను మాధవస్వామి యర్చకుని యల్లుండనియుఁ దనకాపురము కంచియనియు మీనాక్షియను దాసీపుత్రిక ప్రేరణంబున నట్టి కపట వేషము వైచితిననియు నందలి నిక్కువమంతయుం జెప్పివేసెను.

అప్పుడు నిన్నుఁగూడఁ బట్టి దీసికొని రమ్మని రాజు కింకరుల నియోగించెను. ఆ వార్తవిని ముందుగ నేను బరుగిడి వచ్చితిని. నిజముచెప్పుము. కొంపముంచి వేసితినని యడలుచు నడిగిన గడగడ వడకుచు నది యిట్లనియె.