పుట:కాశీమజిలీకథలు-06.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

నర్ధమైనదిగాదు. ఇదియా. యని పలుకుటయుఁ బరమానందముఁ జెందుచు హేమ యిట్లనియె.

దేవీ ! నీ మాట సత్యమగుగాక స్వయంప్రభ నోచిన నోములు ఫలించుగాక. దాని తలిదండ్రులు కృతార్దులగుదురుగాక ఇప్పుడు వారు చింతాసాగరములో మునిఁగి యున్నారు. అని పలుకుచు క్రొత్తయోగి వృత్తాంతమంతయుఁ జెప్పి మీయన్నగారి నిచ్చటికి రప్పింపుమని కోరినది.

అప్పుడు సావిత్రి హేమచేయిఁ బట్టుకొని యుద్యానవన దర్శన లాలసత్వంబునంబోలె దూరముగాఁ దీసికొనిపోయి హేమతోఁ దమ వృత్తాంతమంతయు గొంతమరుఁగు వెట్టియుఁ గొంతవెల్లడించియుఁ దెలియఁజేయుటయు హేమ గ్రహించి మించిన సంతసముతో నిట్లనియె సఖీ ! నాకంతయుం దెలిసినది. ఔరా నీసోదరుండెంత వ్యూహముఁబన్నెను. అట్లుకానిచో నావయస్య పరమేశ్వరుడు చెప్పినను పెండ్లి యాడునదియా ? ఆహా ! ఆ యోగిని యెంత యభినయించినది. కానిమ్ము ఈ రహస్యము వెల్ల డి చేయకుమని బోధించినది. ఇరువురు మరల స్వయంప్రభ యొద్దకరిగిరి. హేమ స్వయంప్రభతో యుక్తియుక్తముగాఁజెప్పి సహదేవుఁడే నీవు వరించిన భర్తయని తెలియఁ చేసినది.

ఆవార్త రాజపత్నికిఁ తెలియఁజేయుటకై హేమ తచ్చుద్దాంతమున కరిగినది. ఇంద్రమిత్రుఁ డప్పుడు భార్యతో నిట్లు సంభాషించుచున్నాడు. దేవీ ! మనము కులమునకుఁ దగని నిందపాలు పడుచున్నారము. లోకులెల్ల మనస్వయంప్రభ చరిత్రము పరిహాసముగా జెప్పుకొనుచున్నారు. కవీశ్వరులు పద్యములుగా రచించుచున్నారట వినుము.

గీ. పెండ్లి యాడననుచు భీష్మించుకొనియున్న
    ముగుద గోరికొనియె ముగురమగల
    నెలతుకల వ్రతంబు నీటిపై చేవ్రాలు
    గాలి వెలుగుదీప కళికసూవె.

అను పద్యము నేను నిన్న వీధిలోఁ బోవుచుండ నొకపిల్లవాఁడు నేను వినునట్లు చదివెను. అప్పటినుండియు నా హృదయమున నవమానకృత పరితాపము బాధింపుచున్నది. రాజులందరు నన్ను జూచి సభలో నవ్వుచుందురు. సహదేవుడు మిక్కిలి చక్కనివాడట. వాని నల్లునిగాఁబడయు భాగ్యము లేకపోయినది. మొదటి యోగియెవ్వఁడో తెలియదయ్యె మొన్నటియోగి శంకర మఠంబున నాపఁజేయబడి యున్నవాఁడు. వాఁడెవ్వండో తెలిసికొనుటకు గూఢచారుల నియమించితిని. ఆ మాయావి స్వయంప్రభను లేనిపోని మాటలాడి నిందింపుచున్నాఁడు. చింతా పరంపర లిట్లు బాధింపుచుండ నేమిచేయవలసినది. స్వయంప్రభాదేవి యస్ముగ్రహ మిట్లు దుఃఖములకుఁ గారణమైనదేమి? నన్నీ యాపదనుండి తొలగించిన నద్దేవి కెన్నియేని