Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

స్వామీ ! మీరు నా చెలికత్తియ మూలమున సంసారములో దిగితిమని పలికితిరి. అది కపటము. మీమూలముననే నా సఖురాలు సంసారములో దిగినదని పరిహాస మాడినది. ఆ మాటల కతండు నవ్వుచు హేమా ! మీరు మిగుల ప్రౌఢురాండ్రు. నాగరికలు. మీతో మేము సమముగా నుత్తరము సెప్పగలమా? అనుటయు నది స్వామీ ! మా ప్రౌఢిమ యిప్పుడేమి తెలిసికొంటిరి. రేపు మా యుద్యానవనములోఁ బ్రవేశించినపుఁడు చూతురుగాక. అని మర్మోక్తు లెన్నియో యాడి నేనా స్వయంప్రభ కాంతరంగిక సఖురాలను మీగుట్టు బయలఁ బెట్టనులెండి. రహస్య మేదియేని యున్నఁ జెప్పవచ్చుననుటయు నతం డించుకఁ బొంకుచు నిట్లనియె

హేమా ! మేము తపోధనులము. పెద్దగాఁ బలకఁ జాలము. రెండు దినములలో నచ్చటికే వచ్చుచున్నాము. గావున నిప్పుడు చెప్పవలసిన దేమియు లేదని పలికెను. పిమ్మట హేమ యటఁగదలి యుద్యాన వనమునకుఁ బోయి స్వయంప్రభతో నిట్లనియె సఖీ ! మనల వంచించుట కెవ్వఁడో మాయావి యట్టివేషము వైచికొనియెను. మాటాడి చూచితిని. మాటలను రూపములును భాపములును జాల విపరీతముగా నున్నవి. అమ్మగారుకూడ రూపమున కాక్షేపించినది, మన ముత్తరము రానిచో నింత విమర్శింపక పోవుదుముగదా ? మన మిప్పుడీ యోగి యా యోగి కాడని చెప్పిన నయ్యగారికిఁ గోపము వచ్చును. నమ్మించుటయుఁ జాలకష్టము ముందు ముందు దెలియపరచెదము గాక వంచకులఁ గపటమున మరల వంచించుటయే లెస్స. ఇప్పుడేమియు మాట్లాడవద్దు. ఇట్లు చేయుదుమని చెవిలో నేదియో చెప్పినది. ఆ మాటలువిని యాబోటి కానిమ్ము. నీకుం దోచినయట్లు చేయుము. నన్ను సంసారనాటకములో వేషము వేయించితివిగదా యని పలికినది. అందులకుఁ దగిన సన్నాహమంతయు హేమ యమరించినది.

మరిరెండుదినము లరిగిన వెనుక నా యోగి నందలముపై నెక్కించి యా యుద్యానవనములోఁ బ్రవేశ పెట్టిరి. అప్పుడు హేమ సఖులతో నెదురుగావచ్చి యొకయింటిలోనికిఁ దీసికొనిపోయి యిదియే వరుండు గదియని చెప్పినది అందు వ్యాఘ్రాజినములు, దర్భాసనములు, కమండలువులు వల్కములు పెక్కమరింపఁబడి యున్నవి. ఆ గదిలో నొకమూల నినుపచిక్కములతోఁ జేయబడిన మంచము మీఁదఁ బులితోలు పరుఁపబడియున్నది.దానిఁ జూపుచు నిదియే తమకు శయన స్థలమని చెప్పిరి.

మరియు నారేయి స్వామీ ! నేఁడు నూతన శయనోత్సవము జేయవలసి యున్నది. మా రాజపుత్రికను మిమ్ములను నేకశయ్యయందుఁ గూర్చుండఁ బెట్టి చేడియలందరు వేడుకపనులఁగావింతురు. అందులకు మీరు కినియరుగదాయని యడిగిన నతండు రాజపుత్రిక తనశయ్యకు వచ్చినం జాలునని సంతోషముతో తనరుహాక్షి