పుట:కాశీమజిలీకథలు-06.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కపట శివానందయోగి కథ

61

చిత్రముగా నున్నదే ? మదీయ వైరాగ్య నాటకమున కిది విదూషక వేషాభినయ ప్రదర్శనమె గాఁబోలు. మరి యా యూరేగింపు యోగి యెక్కడనుండి వచ్చెను. నీవు వేగఁబోయి నతనిఁ జూచిరమ్ము. అంతయుం దెలియఁగలదని పలుకుటయు హేమ వెండియు బండియెక్కి రాజభవనమున కరిగినది.

అందు రాజపత్ని హేమంజూచి స్వయంప్రభ భర్తంజూచి రమ్మని నిన్నుఁ బంపినది కాఁబోలు. ఆయన రూపము కంతు వసంతాదుల మించియున్నదని పొగడితివే ? చాలుచాలు. సామాన్యులలో హీనుఁడు. మాట్లాడినం దప్పుగదా? స్వయకృతాపరాధమునకు శిక్ష లేదు. ఆ గదిలో నున్నవాఁడు చూచిపొమ్ము. అని పలికినది.

అప్పుడు హేమ యామెయొద్ద నేమాటయుఁ బలుక వెరచుచు మెల్లగా నా యోగియున్న యింటిదాపునకుం బోయినది. అప్పుడతం డా యింటిలో రత్నవేదికపై గూర్చుండి యిరువురు తరుణులు వింజామరలు వీచుచుండఁ గన్నులు మూసికొని తావళముఁ ద్రిప్పుచుండెను ముందొక యోగిని కూర్చుండి యున్నది. ద్వారదేశమున నిరువురు రాజభటులు కావలియుండిరి. హేమం జూచి రాజభటులు మెల్లగా రమ్ము సద్దుజేయ వద్దని హస్తసంజ్ఞఁ జేసిరి.

ఆ మాటవిని నవ్వుచు స్వయంప్రభా సఖురాలు హేమయనునది దర్శనమునకు వచ్చినదని చెప్పుము. అని పలుకుటయుఁ బ్రతీహారు లయ్యోగిని కత్తెరం గెరింగించిరి. ఆమెయు బ్రవేశమునకు సెలవిచ్చినది. హేమ లోనికిఁబోయి నమస్కరించినది. ఆతండు కన్నులు మూసికొని తెరపక యట్లే జపమాలం ద్రిప్పుచుండెనుగావున హేమం జూడలేదు. హేమ యట్లే నిలువంబడి యతనిమొగ మెగాదిగఁ జూచి తొంటియోగి కాడని నిశ్చయించినది. అంతలో నతండు గన్నులు దెఱచి హేమను గూర్చుండుమని కనుసన్నఁ జేసెను.

హేమ స్వామీ ! నన్ను మీరు మరచిపోయితిరా యేమి? నా పేరు హేమయండ్రు. నాఁడు రాజపుత్రికను గురించి కోవెల వెనుక పెద్ద తడవు నాతో మాట్లాడిన విషయము జ్ఞాపకమున్నదియా? అని యడిగిన నతండట్లు జరిగినదిగాఁ దలంచి అవును. మాట్లాడితిని. జ్ఞాపకమువచ్చినది అనిచెప్పెను. స్వామీ ! మీ రూపము వెనుకటికంటె చాలమారినది. సుఁడీ ! ఈ యోగిని న న్నెరుంగ నట్లూరకున్న దేమి ? నాయొద్ద మౌనముద్రవిడిచి వెనుక మాట్లాడినది కాదా ! యనుటయు నతండు హేమా ! మేము నీ సఖురాలి గురించి సంసార ప్రసంగములో దిగవలసి వచ్చినది. అందువలన జ్ఞానవాసనతగ్గి లోకవాసన బలియుచున్నది. తేజము కొఱంతయగుటకుఁ గారణ మదియే సుమీ ! మరియు వచ్చిన వారితో నెల్ల మాట్లాడు చుండిన తపంబున కంతరాయమని వెనుకటికంటె మౌనముద్ర నెక్కుడుగాఁ గావించితిమి. అని యేదీయో చెప్పెను.