60
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
వార్త విని యా జాబా బండిలోఁ బడవైచెను. హేమయు నా చీటిఁ చూచి బండి నిలిపి యా చీటివిప్పి యిట్లు చదివినది. ప్రేయసీ ! నీవు గర్భవతివైతివి. ఇప్పుడు నీ యిష్టమునకు వినిమయముగా నందుండ లేచిపోయితిని నేనిప్పుడు గ్రొత్తయోగములం దెలిసికొన హిమవత్పర్వత ప్రాంతముల యందున్న మా గురువుకడ కరుగుచున్నవాఁడ. వెండియు శీఘ్రమే రాఁగలను. నీ కుమారునెత్తుకొని దీవింతు, ముద్దు పెట్టుకొనియెద. ఆ బాలుఁడే నీతండ్రి రాజ్యమున కధికారి. మనము ఆ తపోవనమున కరుగుదము, విచారింపకుము. ("అద్వైత శివానందయోగి")
అని యున్న యుత్తరము ముమ్మారు జదివి విస్మయముఁజెందుచు బండి వెలుపలకుఁ దొంగిజూచి యా చీటినిచ్చినవా రెవ్వరని యడుగుటయు నందున్న యతండు అమ్మా ! నేను. నేను అని బదులు చెప్పెను. నీ కీ యుత్తర మెవ్వ రిచ్చిరని యడిగిన హేమతో అమ్మా ! వినుము. కొన్ని దినముల క్రిందట నేను రత్నకూటగిరి ప్రాంతమున కరిగితిని. అందు స్వయంప్రభాదేవి కోయలలోఁ దపము జేసికొనుచున్న యోగి యమ్మగారితోఁగూడ నెక్కడికో పయనము సేయుచు శకునము దీర్చిన నా మొగ మెగా దిగా జూచి యోరీ నీ దేయూరని యడిగెను. నేను వెఱచుచు చేతులు జోడించి స్వామీ: మా కాపురము గిరిదుర్గపురమే. మేము కాపు వారమని చెప్పితిని. అప్పుడాయన యొక్కింత తలయెత్తి యాలోచించి యోరీ ! రాజపుత్రిక స్వయంప్రభ నెరుగుదువా? దాని సఖురాలు హేమ పేరు వినియుంటివా యని యడిగెను.
స్వామీ ! ఇరువురపేరులు వినియుంటి. పరిచయముమాత్రము లేదు. నా చేయవలసినపని యేదియేని యుండినఁజెప్పుడు గింకరుండనై శ్రద్ధాభక్తులతోఁ జేసి కృతకృత్యుఁడ నయ్యెదనని యతివినయముతో బ్రార్ధించితిని. అప్పడాయన మరేమియును లేదు. ఈ యుత్తరము హేమ కందియ్యవలయును. సమయమరసి యుపాయము చేసికొని యిత్తువేని నిన్ను వృద్ధిబొందునట్లు దీవించెదనని పలికిన సంతసించుచు స్వామీ ! తప్పక నిది యామెకీయఁగలను నన్ను దీవింపుడని పలుకుచు నీ యుత్తరముఁ బుచ్చుకొంటి. అయ్యోగియు నామెయు నుత్తరముగాఁ బోయిరి. నాటంగోలె మీ నిమిత్తము తిరిగి తిరిగి విసిగిపోయితిని. నేడు నా పుణ్యంబునం గనంబడితిరని జెప్పెను.
ఆ మాటలువిని ఓయీ ! నీకు పారితోషిక మిప్పించెద నీ విచ్చటికిరమ్ము. పొమ్మని పలుకుచు హేమ బండి వెనుకకు మరలించి రాజపుత్రియొద్ద కరిగినది. స్వయంప్రభ హేమంజూచి యేమే ? ఇంతలోనే వచ్చితివేమి ? అయ్యోగినిఁ జూచి రమ్మంటినిగదా శకునము కాలేదాయని పలుకుటయు నమ్మగువ యాశ్చర్యముతో కాంతా ! వింతలు వినంబడుచున్నవి. ఈ పత్రికం జూచికొమ్మని చేతికిచ్చెను.
రాజపుత్రి యా యుత్తరముఁ జదివికొని యయ్యారే ! ఇది మిక్కిలి