Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కపట శివానందయోగి కథ

59

లవియేకా నిరూపము లవికావు. అది రహస్య స్థలమగుట మరియొక తపస్వు లచ్చటికివచ్చి జపముఁ జేసికొనుచుండిరని తలంచితిని. కాని జటావల్కలాదులు మనము సంపాదించినవగుట గురుతుపట్టి వారును డాంబికులేయని నిశ్చయించి యా రహస్యముం దెలిసికొను తలంపుతో నా ప్రాంతమందే తిరుగుచుంటిని. వారును మీవలెనే సామాన్యులతో మాట్లాడక మౌనవ్రతమే యవలంబించిరి.

మరికొన్ని దినముల కమ్మహారాజు దైవికముగా రత్నహారము దొరకెనని వార్త విని సంతసించుచు నక్కపటయోగివద్దకరిగి కృతజ్ఞతఁ జూపి రత్నములతోఁ గూర్చిన రుద్రాక్షమాల యొకటి వాని కిచ్చెను. అయ్యారే ! ప్రశ్న మొకఁడు సెప్పఁ గానుక మరియొకనికి లభించినదిగదా ! తరువాత నే యా భూపతి కూఁతునకు వివాహ ప్రయత్నము గావించి మీ తండ్రిగారికి శుభలేఖలం బంపెను. అంతలో స్వయంప్రభ గాంధర్వవిధిని యతి కుమారుం బెండ్లి యాడినట్లును గర్భవతియైనట్లును విని ప్రస్తుతము తరలిరావలదని యిక్కడి కుత్తరము వ్రాయుచు నానూయావియే తనకల్లుఁడని నిశ్చయించుకొని యా కొండదండ కరిగి యా యోగినితోఁ గూడ వాని నందల మెక్కించి యింటికి కొనిపోయెను. మరియు నమ్మరుసటి దినంబునఁ బౌరులకెల్లఁ దెల్లమగునట్లు భద్రగజంబుపై నాటక్కరి నెక్కించి మేనంతయు బంగారుమయముగా నలంకరించి యూరేగింపుచుండిరి. పౌరులెల్లరు నత్యద్భుత ప్రభావ సంపన్నుండగు యోగియాతఁడే యనుకొని దేవునికివలె మంగళహారతు లీయఁదొడంగిరి.

అక్కటా ! ఆ యుత్సవ మంతయు గన్నులారంఁజూచి యోర్వఁజాలక చేయునది యేమియునులేక వేవేగమ పరుగెత్తుకొని వచ్చితిని. దేవా! మనము నాటిన వృక్షము వానికి ఫలములిచ్చుచున్నది. ఆలస్యమైనచో వాఁడె స్థిరపడగలడు. ఏదియో ప్రతీకార మొనరించి వానిం ద్రోసిపుచ్చి యా వైతవము దేవర యనుభవింపవలయునని యతండా కథనంతయుం జెప్పెను.

అప్పుడు వసుమిత్రుండు పక్కున నవ్వుచు మిత్రమా! వాఁడెవ్వడో నీపై వాఁడుగదా ! మంచి యుపాయ మాలోచించెనని పల్కుచుండ సహదేవుం డేమియుందోచక కళవరమందు డెందముతో చెల్లెలి కవ్విధ మంతయు నెరింగించెను. నిపుణమతియగు నా యువతి యా కథనిని అన్నా ? మించినదేమియును లేదు. తొందర పడకుము. స్వయంప్రభ గర్భవతి యయ్యెనని వింటిమి. ఆ సతి దృఢవతగదా ? హేమయు బుద్ధిమంతురాలు. విమర్శింపక తొందరపడువారుకారు. మరియు నీ వొక యుత్తర మిటులవ్రాసి పంపుము. కార్యసాఫల్యమగునని చేయఁదగిన కృత్య మంతయు బోధించి సంతోషముఁ గలుగ జేసినది.

అతండప్పుడే యొక యుత్తరమువ్రాసి వసుమిత్రుని మిత్రునికిచ్చి పంపెను. అతండా చీటినిగొని యతి రయంబున గిరిదుర్గమున కరిగి యుద్యానవనద్వార --------------- దైవికముగా బండియెక్కి యెక్కడకో బోవుచున్న హేమ