Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

బ్రధానసాధనమైనదిగదా? శారికయు మంచి నేర్పుతోఁ దనపాత్రకుఁదగిన చర్య లద్భుతముగా నడిపినది. ఇక జెప్పునది యేమున్నది. క్రమంబున నారాజపుత్రిక మా పన్నిన వ్యూహంబులోఁబడి నన్ను వివాహమాడినది మూఁడుదినములు మా యొద్దనేయున్నది. అంతలో రాజకింకరులు వీణావతింబట్టి తెలుసుకొనివచ్చిరి. అది నన్నెఱింగినదగుట మాగుట్టు బై లఁబడునను తలంపుతోఁ నా రాజపుత్రిక యింటికిఁజనిన వెంటనే మా వేషములు తీసివేసి వడివడిగా నిచ్చటి కరుదెంచితిమి. ఇదియే జరిగిన వృత్తాంతమని యా కథ యంతయు సొంతముగా వక్కాణించెను.

ఆయ్యుందంతమువిని యక్కాంత మిక్కిలి సంతసించుచు అన్నా ఈ నడుమ నొకవిశేషముజరిగినది వినుము. ఇంద్రమిత్రుఁడు తనకూఁతురుస్వయంప్రభను నీకిచ్చి వివాహముఁ జేయిటకు ముహుర్తము నిశ్చయించి శుభలేఖల నంపుటయు నేను మన జనకుని ప్రోత్సాహపరచి యంగీకరించితిమి. ప్రత్యుత్తరమును వ్రాయించితిని. వానికిబదులు ప్రస్తుతము హూర్తమునిలిపినట్లు పత్రికలు వచ్చినవి. అందలి కారణ మేమియో తెలియవలసియున్నది. యతి వేషము ధరించి నీ వరిగితివని వా రెఱుంగ లేదుగదా ! అని యడిగిన నతం డాలోచించి యా రహస్యము వారి కేమియం దెలియదు. అందులకు వే రెద్దియేని కారణ ముండవచ్చును. మరియు మేము వచ్చిన తరువాత నచ్చట జరుగువిశేషములం దెలిసికొని రమ్మని వసుమిత్రుని మిత్ర నొక్కని నందుంచి వచ్చినారము. అతండు వచ్చిన నంతయుం దెలియగలదని పలికెను.

కపట శివానందయోగి కథ

అట్లు మాట్లాడు చుండగనే యొక పరిచారిక వచ్చి రాజపుత్రా ! వసుమిత్రుని మిత్రుఁడు వాకిట నిలిచియున్నవాడు. మీతో జెప్పవలసినమాట లవసరమై యున్నవట యని చెప్పిన సంభ్రముతో సహదేవుండుచెల్లెలినిలోపలికంపి వాని నచ్చటికిఁ దీసికొని రమ్మని చెప్పెను. తదానతి వసుమిత్రుఁడును, మిత్రుఁడును లోపలికి వచ్చిరి. మిత్ర మిత్రుఁడు రాజపుత్రుని మన్ననల కానందించుచు దేవా! లోకములో వంచకులు పెక్కండ్రుకలరు. తాడిఁదన్ను వాని తలఁ దన్ను వాడన్న వాడుక యదార్థమై యున్నది. మనము రాజపుత్రికను వంచించితిమి. మనల నిపుడు మరియొకఁడు వంచించుచున్నాఁడు వినుండు. మీ రరిగిన మరునాడే యా యూరివాఁడెవ్వడో మనగుట్టుఁ దెలిసికొనియున్నవాఁడు కాఁబోలు. మన మా ప్రాంతమందు బారవైచిన జటావల్కలముల సంగ్రహించి నీవలెనే యతి వేషధారియై యొక యాడుదానికి యోగినీవేషము వైచి యా మంటపములోఁ గూర్చుండి జపము చేసికొనుచున్నటుల నటించుచుండెను.

ఆమరునాడు నేనేమిటికో యచ్చటికిఁ బోయినంత వారిరువురు గనంబడిరి. మీరు మరల వచ్చిరాయని భ్రాంతినొంది దాపునకుఁబోయి చూచితిని. వేషము