Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

క. నలుపయ్యెఁ జూచుకంబులు
   తెలుపయ్యె న్మొగము మేనితేజముతోడన్
   వలమయ్యె నడు మడంగెదు
   వశు లానృపసూతి గర్భవతియై యొప్పన్.

అట్టి లక్షణంబులఁ బరీక్షించి యంబుజాక్షులు గుజగుజలాడుచుండఁ దెలిసికొని హేమ స్వయంప్రభ కెఱింగించినది. పాలిండ్లుబిగువగుటయు, నొడలు బఱువగుటయు, భోజనము వెగటగుటయుఁ గనిపెట్టి యప్పలుకులు సత్యములని యొప్పుకొని రాజపుత్రిక యప్పుడే యొక పరిచారికం దల్లిని దీసికొనిరమ్మని పంపినది ? రాజపత్ని యవ్వాచకమువిని యత్యాతురముతో నుద్యానవనంబునకు వచ్చినది. ఇప్పుడు స్వయంప్రభ యొకగద్దియపైఁ గూర్చుండి తలవంచుకొని వెక్కి వెక్కి యేడ్చుచుండెను. హేమ ప్రక్కను నిలువంబడి యేదియో చెప్పుచున్నది. అట్టి నందనంగాంచి రాజపత్ని యదిరిపడుచు దరికరిగి పట్టీ ! నీవిట్లు విచారించుటకుఁ గతంబేమి? నీ వెన్నడును గంటఁ దడివెట్టి యెరుంగవుగదా? మణిహారము పోయినను నిన్నించుకయు నిందించితి కామే? నా హృదయము బేధించుచున్నది. నీ చింతాకారణము వడిగాఁ జెప్పుమని యెంత యడిగినను నక్కలికి వెక్కి వెక్కి యేడ్చుటయే గాని యేమియు సమాధానముఁ జెప్పినది కాదు. తలయెత్తి చూచినది కాదు.

అప్పుడు రాజపత్ని హేమంజూచి యిందలి కారణము నీకు దెలియక పోదు. వడిగా నుడువుఁ మనుటయు నత్తరళాక్షి అమ్మా ! మఱియేమియు నుపద్రవము లేదు స్వయంప్రభ స్వతంత్రించి చేసినపనికై చింతించుచున్నదని చెప్పినది.

రాజ :- అది యెట్టిదో వివరముగాఁ జెప్పుము?

హేమ :-- మొన్న మీతో మనవి చేయలేదా? ఆ మాటయే నిజము మీరు పరిహాస వచనములని త్రోసివేసితిరి.

రాజ :- ఏమీ ! నాబిడ్డ భర్తను వరించినదా?

హేమ :- దుష్యంతుఁడు శకుంతలను వరించినట్లే గాంధర్వ విధానంబున వరించినది.

రాజ :- అట్టివాఁడు లభించెనా?

హేమ :- అంతకన్న నధికుండే.

రాజ :- ఏమి యావింత? రవ్వంతయైనను దెలియ నిచ్చిరికారేమి?

హేమ : - అందులకే పశ్చాత్తాపముఁ జెందుచుంటిమి

రాజ : - వాని పేరెద్దియో చెప్పుము?

హేమ : - అద్వైత శివానందయోగి.

రాజ :- (ఉదరముపైఁ జేయిడుకొని) గిరిదర నాలయములో నున్న సన్యాసియా యేమి ?