పుట:కాశీమజిలీకథలు-06.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అద్వైత శివానందయోగి కథ

53

జాడ నరసిరమ్మని యా కింకరుల నంపెను. వారు పోయివచ్చి దేవా ? అయ్యోగి యోగినితోఁగూడ మంటపముపైఁ గూర్చుండి జపముఁ జేసికొనుచున్నాఁడు. తమరాక నివేందించిన సంతోషముతో రావచ్చునని సెలవిచ్చినాఁడు అనిచెప్పిన నప్పుడమిరేఁడు పాదచారియై వినీతవేషముతో నొక్క రుఁడ యక్కడకుఁజని యతని పాదములకు నమస్కరించెను.

ఆ యోగి లేవనెత్తి రాజా ! నీభక్తికి మెచ్చితిమి. నీవు వచ్చిన కార్యము సెప్పుమని యడిగెను. రాజు స్వామీ ! నా కేకోరకయునులేదు వెనుక దేవతదర్శనమునకు వచ్చితిని. అప్పుడు పలుకుట కవసరమైనది కాదు మీరు సెలవిచ్చిన విషయములన్నియు తప్పక జరిగినవి. ఆ వార్తఁ దమ కెరిగించి పోవలయునని వచ్చితిని. ఈ దాసునియం దెప్పుడును గృపాదృష్టి వ్యాపింపఁ జేయుచుండవలెనని ప్రార్ధించెను.

అప్పు డయ్యోగి రాజా ! మే మంతయు నెరింగియే చెప్పితిమి నీవింటికింబోయి సుఖముండు. మదియే పదివేలని పల్కుటయు వినమృఁడై రాజు రత్నములతోఁ గూర్పబడిన రుద్రాక్షమాలిక యొకటి యాఋషి మెడలోవైచి నమస్కరించి యవ్వలకుం బోయెను. సంతోషముఖములతో నభిముఖముగా వచ్చిన యమాత్యులతో ముచ్చటించుచు యింద్రమిత్రుండు నగరుఁబ్రవేశించెను. అందు భార్యతోఁ దాను బడిన యిడుమలన్నియుఁ చెప్పికొనుచు నప్పుడమి యొడయఁడు పడతీ ! నీవీతొడవు దొరకిన వెనుక చిరంజీవినియొద్ద కరిగితివా ? ఇది ఎట్లువచ్చినదని చెప్పినది? పెండ్లిమాట యేమనుచున్నది. యడిగిన రాజపత్ని యిట్లనియె. నాధా ! నేనప్పుడే యమ్మాయియొద్ద కరిగితిని. ఆమణిహారమును కంఠమున ధరించియున్నది. వీణావతియే తెచ్చియిచ్చినదని చెప్పుచున్నది. పరిణయము విషయమై యిప్పుడు కొంచెముచిత్తవృత్తి మారినదనితోచుచున్నది. అదివినుచుండ హేమా ! నీ వయస్యకు నీకు నిరూపించిన రాజపుత్రునిఁ బెండ్లి సేయుటకు నిశ్చయించితిమి. ఆమాటమీరు వింటి రాయని పలికితిని. హేమ స్వయంప్రభ మొగముఁజూచినది. అదియు నించుక సిగ్గుతో నా నిమిత్తమిఁక పరిణయ ప్రయత్నముఁజేయ నవసరములేదు. మీ నిర్బంధమున నే కన్నెరికము వదల్చుకొంటిని. అని పలుకుటయు పరిహాసవచనముగాఁ దలంచి హేమ నడిగితిని. అదియు దాని మొగముఁ జూచుచుఁ జిరునగవుతో భర్తృదారిక బొంకులాడునదియాయని చెప్పినది. పో పొండు. మీబాసలు మీకకాక యొరులకు తెలియవని పలుకుచు నింటికి వచ్చితిని. పెండ్లియాడ కేమిచేయును. సంబంధము నిశ్చయింపుడు. వేర వెదుకనేల? భూరిశ్రవునికొడుకు సహదేవునకే యిచ్చునట్లు శుభలేఖలు వ్రాయింపుడు అని చెప్పినది అతండందులకు కనుమోదించి యప్పుడు సిద్ధాంతుల రప్పించి ముహూర్తముల నిరూపించి శ్రుతశీలసంపన్నలగు బ్రాహ్మణుల నలువుర శుభలేఖలతో నాభూరిశ్రవు నొద్ద కనిపి పట్టణమంతయు నలంకరింప నాజ్ఞ యిచ్చెను.

( అంత నచట యుద్యానవనంబులో :-)