అద్వైత శివానందయోగి కథ
51
బలవంతమున నంతము నొందుటయే శ్రేయము. అని పలుకుచు గోలుగోలున నేడువఁ దొడంగినది.
అట్టిసమయమున హేమ ప్రత్యుత్తరమీయ వెఱచి యొదిగి యొకమూలఁ గూర్చుండెను. ఆమె కోపము కొంత చల్లారినవెనుక హేమచెంతఁ జేరి కాంతా ! నీవలిగిన నే నేమియుం జెప్పజాలను. మణిహార ప్రదానమున నతండు మహానుభావుండని తెల్లమగుచున్నదిగదా! వ్యాసమహర్షియంత వాఁడు రాజభార్యలతోఁ గ్రీడింపలేదా? దాన నతని మహిమ కొఱంతపడినదా ! దీన మీకు వచ్చిన లోపము లేదు. ఇది ప్రఖ్యాతికే మూలకము. చింతింపకుము. నీ వారు వినిన సంతసింతురు గాని కోపింపరు అని స్తోత్రముఁ జేయుచు నా యువతికి సంతోషము గలుగఁ జేసినది.
వారి సంవాదము ముగిసినదని యెరింగి ద్వారమున వేచియున్న పరిచారిక లోపలికిఁబోయి భర్తృదారికా ! వీణావతి మీ దర్శనమునకు వచ్చి ద్వారమున వేచియున్నది. రప్పింపవచ్చునా యని యడిగిన నంగీకారము సూచించుటయు నది వోయి వీణావతిని తీసికొని వచ్చెను. వీణావతి యా యువతికి నమస్కరించుచు తన్ను రాజభటులు పెట్టిన నిర్బంధమంతయుఁజెప్పికొని రక్షింపుఁడని ప్రార్ధించినది.
వీణావతి వృత్తాంతమంతయు విని హేమ యెద్దియో ధ్యానించి మించుబోణీ !నీవు విచార పడకుము. నీ యాపదఁ దప్పించెదను. నీ వా మణిహారము మాకిచ్చిన ట్లుత్తరము వ్రాసి యిచ్బెదము. నీవీణ చక్కఁబడి నందులకు మిగుల సంతసించితిమి. అని పలుకుచు నప్పుడే యట్టియుత్తరము వ్రాసి యంపినది. తరువాత రాజపుత్రిక హేమా ! నీ వొకసారి యా గిరి పరిసరమునకేగి వారేమి చేయుచున్నారో చూచిరమ్ము. అని చెప్పి యంపినది.
హేమయు నతిరయంబున బోయి వారిజాడ నరిసినదిగాని యందెవ్వరును గనంబడలేదు. వారి వస్తుసామాగ్రియు నందులేదు. అప్పుడు విస్మయముఁ జెందుచు తిరిగివచ్చి యత్తెర గత్తెఱవ కెఱిగించినది. ఆ కథవిని రాజపుత్రిక హేమా ! నావలెనే యామహానుభావుండు దుష్క్రి యాచరణమునకు పరితాపమునుఁ చెంది యిందున్న డెందము వికార మొందునని యెందేనిం జనియెనని తలంచెద. ఉత్తముల చిత్తములు జలంబులవలె నన్యసంఘట్టనంబునం గలఁగినను మరల నిర్మల భావము వహింపక మానవు. పోనిమ్ము నా కన్నెరికము వదలినదిగదా ! నాతలిదండ్రులు నన్ను బెండ్లియాడుమని నప్పుడి త్తెరం గెరింగింపవచ్చును. మంచిముహూర్తము తెలిసికొనిరమ్ము. నేనును జటావల్కముల ధరించి యోగినివేషము వైచుకొని యిందు తపంబు గావించెదను. అని వైరాగ్యవృత్తితోఁ బలికిన విని హేమ యిట్లనియె
సుందరీ ! తపంబునకుఁ దొందర యేమివచ్చినది. అతండు యతియో భూపతియో యించుక విమర్శింప వలసియున్నది. ఎట్లయినను నీవు ధన్యురాలవేగదా ! యని యుక్తముగాఁ జెప్పి యప్పటి కామెచిత్తవృత్తి మరలింపఁ జేసెను.