పుట:కాశీమజిలీకథలు-06.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

దీనికే నీవింత పశ్చాత్తాపముఁ జెందుచుంటివి? చాలు చాలు. అమ్మహర్షికుమారుని శక్తి నెఱుంగక వికారము నొందెనని భ్రమ జెందితివి. మన కట్లుతోచునుగాని వారిమదికి వికారములు లేవుఁ శ్రీకృష్ణునిచర్య లెట్టివో యెఱుంగవా అమరుక నృపవధూపరిచయంబు ఆదిశంకరులను గళంకపరచినదాఁ మహాత్ముల చేష్ట లద్భుతములు ఇదమిద్ధమని మనము నిరూపింపఁ జాలము. వారు చెప్పినట్లు చేయుటయే మనకు లెస్స. ఏమియుఁ బ్రతికూలము సెప్పరాదు. మనసు కలసిన పిమ్మట నంతయు నంతడే నీకుఁజెప్పఁగలఁడు. నీనిమిత్త మెంతయో బ్రతిమాలితిని. స్త్రీప్రశంసయే విననివాఁడు నీ ప్రక్కఁజేరి నందులకుఁ సంతసింపకఁ జింతించుచుంటివా? ఈ రేయి నతం డెట్లు చెప్పిన నట్లు నడువ వలయును సుమా ! అని బోధించి నా మనసు సమాధాన పరచినది.

ఆ యోగిని కడు జాణకదా? ఆ పగలెల్ల నా కా బోధయే చేయుచున్నది. పుష్పములచేఁ జక్కగా నలంకరించినది. అంతలో సాయంకాలమగుటయుఁ బూర్వమువలె మమ్మిరువుర నేకశయ్యాగతులఁ జేసి యవ్వలకుం బోయినది. అటుపిమ్మట నమ్మహాయోగి భోగపరుండై నిముషమైనఁ దమి నిలుపజాలక మోహావేశముతో నన్ను బిగియ గౌగలించె. పైనఁ జెప్పవలసిన దేమున్నది. అని నిట్టూర్పు నిగుడించుచు మన్మధుం గృతార్ధుం గావించెను. నాకాచేష్ట లేమియు నభీష్టములుగాకున్నను నెదురాడవెరచి ప్రతిమవలె నూరకుంటి. అంతలోఁ దెల్లవారినది. నాఁడు తపమేలేదు. పగలెల్ల నాచుట్టుచుట్టుదిరుగుచుండెను. మరల రాత్రిపడినదోలేదో వెండియువిలాసక్రీడకుఁ దొరకొనియెను. శరీరధర్మము లెట్టివారిని మోసము సేయకమానవు. రుచి యెరుగనప్పుడు సుకారసము విరసముగా నుండును. అలవాటు పడిన నమృతముకన్న మిన్న యగుంగదా ! అక్కటా ఇంద్రియములు వివశుండగు దేహిని సారధిలేని రథమును గుఱ్ఱములట్ల నలుమూలలకుఁ ద్రొక్కించును. అయ్యో ! ఆ చేష్టలం దలంచికొన సిగ్గును విషాదమును శోకమును గలుగుచున్నవి. నావలన నితండును నతనివలన నేనును జెడితిమి. అతనిచేష్టలు ఋషికృత్యములట్లు నాకుఁ దోచలేదు. మూడునికన్నఁ దక్కువగా వస్తువిమర్శన లేనివాడయ్యె ? ఇంద్రియము లేమియు నతని స్వాధీనములోలేవు. అన్ననా ! ---------- వంటి మహాత్ముని విటునిగాఁజేసి తపంబు జెరచిన నా పాపమునకు మేరయున్నదా అక్కటా ! నేనిప్పు డందరికన్నఁ దక్కువదాననై పోతి. సామాన్యస్త్రీవలె తుచ్ఛ భోగములకుఁ బూనికొంటి. నా వివేకము మన్నై పోయినది. నావిషయ వై ముఖ్యము డాంబికమునకు వినియోగించినది. ఇంత వరకును గారకురాలవు నీవు ఆ యోగినితో కలసి నీవు పెండ్లి యనిచెప్పి నన్ను మోసముఁ జేసితివి. బ్రష్టురాలనై పోతిని. మధిచలపట్టి నన్ను సంసారసముద్రములో ముంచివై చెనుగదా? నా చరిత్రమువిని యెల్లరుఁ బరిహాసమాడక మానరు. తల్లిదండ్రుల కేమని యుత్తరము సెప్పుదును, -------- నేనెక్కడ. యోగి యెక్కడ. పర్వతమెక్కడ తపమెక్కడ. అఘటిత ఘటనాసమర్ధుని భగవంతుని విలాసములు కడుచోద్యములుగదా? ఇట్టి పాతకముఁ గావించి బ్రతుకుటకంటె