పుట:కాశీమజిలీకథలు-06.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(7)

అద్వైత శివానందయోగి కథ

49

అప్పుడు నేను మేను ముడిచికొని చేతుల నురముం గప్పికొని కూర్చుంటిని. అతడించుక వంగి నాచేతుల రెంటినిం బట్టుకొని ముద్దుపెట్టుకొనుచు దన కరతలంబులు నా కపోలముల వాని మోమించుక యెత్తి మత్త కాశినీ ? ఇటుచూడక మాటాడక కన్నులు మూసికొనియెద వేమిటికి ! నీ నిమిత్తము తపంబు మాని యవకాశముఁ జేసికొని వచ్చితినికదా ! తెలిసికొనదగిన విషయము లడుగవేమి ? నన్నిఁక నన్యునిగాఁ దలపకుము. సిగ్గువిడువుమని పలుకుచు దగ్గరకు లాగికొని గౌఁగిటఁ జేర్చుకొని శిరముపైఁ జేయివైచి జడవెంబడి దువ్వదొడంగెను.

అప్పుడు నేను బోనునం బెట్టిన కురంగియుంబోలెఁ గొట్టికొనుచు నంతరంగమునఁ బలుదెఱంగులఁ జింతించుచు నేమిచేసిన నేమికోపము వచ్చునోయని వెఱచుచు ప్రాణము లుగ్గబట్టుకొని కౌఁగిలి యెప్పుడు వదలునాయని ధ్యానించుచుంటి. నా వికారము గ్రహించి కొంతదరికిఁ గౌఁగిలివదలి కొమ్మా ! పోనిమ్ము ! నీ మనసు వేఱొకలాగున నున్నది. తెరపిఁ జేసికొనియే మాటలాడుము. ఇందుఁ బండుకొనుము. ప్రొద్దు వోయినది. అని పలుకుచు నాశయ్యపైఁ గొంతభాగము నా కవకాశమిచ్చి యతండు పండుకొనియెను.

నేను శయ్యవిడచి దూరముగా శయనించి యిట్లు ధ్యానించితిని. అహహా ! స్త్రీజాతి కడు పాపజాతికదా! మదీయ సాన్నిధ్యంబునం జేసి నిశ్చలంబైన యీతని మనంబు గాలిచే దీపమట్లు చలించినది. నాపాలిండ్లఁ జేయిడినప్పుడు చేతులఁ బొడమిన పులకాంకురములు మకరాంక చిహ్నములుగాక మరియేమి ? నన్ను బిగ్గ గౌవుగలింప నవసర మేమివచ్చినది? ఏమా! ఒకవేళ ప్రీతికొరకట్లు చేసెనేమో? తెలియక మహాత్ములపై దోషారోపణఁ జేయుట పాతకము. అని ధ్యానించుచు నిద్రలేక కన్నులు దెఱచియె పండుకొనియుంటి. కొంత సేపటి కతండు శయ్యనుండి లేచి నాయొద్దకువచ్చి నామొగముఁ బరిశీలించి చూచుచు ముద్దు పెట్టుకొనుచుఁ జుంబించుచు నొక్కుచు నంటకయే పెక్కు కామవికారములం గావించెను.

అర గనుమోడ్పుతో నంతయుఁ జూచుచు నే నది మోహావేశమని యెఱింగి మోము నేలవంకఁ ద్రిప్పి పండుకొంటిని. అంతలోఁ దెల్ల వారినది. అతండు స్నానార్ధమై యరిగెను. ఆ యోగిని నాయొద్దకువచ్చి ప్రాతఃకృత్యముల వర్ణింపఁజేసి భామినీ ! రాత్రి విశేషములేమి? తత్వరహస్యము లేమైనం దెలిసికొంటివా యని యడిగిన నే నిట్లంటిని. అమ్మా ! తత్వవిశేషములు తెలిసికొనుదాన నైతినేని యీ యాడు పుట్టుక యేమిటికిఁ బుట్టుదును. ఈ పాపజాతి తాను జెడుటయే కాక యొరులంగూడఁ జెరుపుచుండును. అమ్మహాత్ముని చెరప మీరునన్నుఁ బరుండఁబెట్టిరి. లక్కచెంత నిప్పు పెట్టిన మెత్తపడక గట్టిగా నుండునా? తపోవ్యాస క్తమగు నమ్మహాత్ముని చిత్తము నాకతమున -------------- నొందినది, రాత్రిచర్య లేమి చెప్పుదునని చింతింప దొడంగితిని.

అప్పుడా యోగిని మందహాసము సేయుచు నబలా ! ఏమో యనుకొంటిని