Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

కాయనసేవఁ జేయుటకు మంచి సమయము దొరికినది. మంచి విశేషములం దెలిసికొనఁగలవు.

మనోభవరహస్య విశేషము లన్నియు నివేదింపఁగలఁడు. నీపుణ్యము మంచిదని కొనియాడుచు నమ్మంటపమునఁ బుష్పశయ్యఁ గల్పించి యా యతి కుమారుండు విసిరికొనుచుండ బలాత్కారముగ లాగికొనివచ్చి యా తల్పమునఁ గూర్చుండఁ బెట్టినది.

ఆమె యోగినియైనను విలాసముల మరచిపోలేదు. నాచేయి నతని చేతిలోఁబెట్టి స్వామీ ! ఈచిన్నది కడు వైరాగ్యవంతురాలు పరమార్థ విశేషములం దెలిసికొనుటకే మిమ్ము భర్తగా స్వీకరించినది. చనువుఁ గలుగఁజేసి యాత్మభవతత్వ విశేషము లన్నియు నీమెకు బోధింపుఁడని పల్కుచు నన్నువిడచి యామె యవ్వలకుం బోయినది. బోటీ ! పిమ్మట నేమని చెప్పుదును. ఏమాట యాడుదమన్నను నాకు నోరురాదు. ఏమిచేయుదమన్నను గరపాదములు ప్రసరింపవు. మేనంతయుఁ జెమ్మటలు బట్టినది. శరీరము వణక దొడంగినది. వేయేల మందాక్షము న న్నస్వతంత్రురాలిగాఁ జేసినది. స్వప్న మో యింద్రజాలమో యని తలంచుచుంటి.

అప్పుడా రాజకుమారుండు మంటపము స్థంభమునకుఁ జేరఁబడి తరుణీ ! అట్లు వెరచెదవేమిటికి ? భయముడిగి యిటు గూర్చుండుము. అని హస్తముతో నిర్దేశించినంతఁ గొంత తెఱపిఁదెచ్చుకొని యించుక యెడముగాఁ గూర్చుండి తలవంచుకొంటి. ఆయన యించుక నవ్వుచు పువ్వుఁబోణీ! నీ చరిత్ర మంతయు నంతర్దృష్టిఁ దెలిసికొంటి. నీవు కడు పవిత్రురాలవు. నీ మనసు నిర్మలమైనది. అని యెరింగియే మాయోగిని నిర్బంధింప నీ పెండ్లి కంగీకరించితిని. నీవు స్వయంప్రభ కన్న నెక్కుడు మహిమ సంపాదింపఁ గలవు. వెర పుడిగి మాటలాడుము. నీ యభీష్ట మేదియో చెప్పుము అని యడిగెను.

సిగ్గు నన్నగ్గపరచుకొని కంఠమునకుఁ గవాటమై యేమాటయు నన్నడగ నిచ్చినదికాదు ! పిమ్మట నతండు మంచిదానవు మంచిదానవని పలుకుచు నావీపుపైఁ జేయివైచి యించుక దగ్గరకు లాగికొనియెను. అప్పుడు నేను పురుషసంపర్కమున కులికిపడుచు భర్త యనుమాటఁ దలంచికొని సమాధానపడితిని.

పిమ్మట నతండు నామెడలోఁ జేయి పెట్టి హారము సవరించుచు మనో హారిణీ ? ఈ హారమునిమిత్తమే గాదా నీతండ్రి మిక్కిలి పరితపించు చున్నవాఁడు. దీని నేఁ దెప్పించనిచో నీరాజ్యము వేశ్యకాంత యధీనమైపోవునుగదా ! దీని నిమిత్తమే వెనుక మీ తండ్రి నా యొద్దకు వచ్చెను. ఇదియే మనకు బంధుత్వముఁ గలిపినది. అని పలుకుచు పేరులు సవరింపుచుండ తత్కరతల స్పర్శమునకు మేను ఝల్లుమన నేనా హారము పైకి దీయఁబోయితిని. వలదు. వలదు. అట్లేయుంచుము. అని పలుకుచు నా భూషణంబు నా మెడలో నదిమివైచెను.