Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

ఆయోగిని యా యువతి నమస్కారములందుకొని పెండ్లికూఁతువు రమ్మని దీవించుచు నాలయము లోనికిఁబోయి యమ్మునికుమారుని రమ్మని పిలిచినది. అబ్బా ! నీవుపట్టినపట్టు విడువవుగదా ! తపంబున కంతరాయముగా నాకీ గొడవ యేమిటికిఁ దెచ్చిపెట్టెదవు? మహర్షులు పరోపకృతికై పెండ్లియాడుదురని మాటవరుస కనినందులకు నాపనియే పట్టుచుంటివి. పో పొమ్మనుచుండ గడ్డము పట్టుకొని స్వామీ! మీరట్లనరాదు. మీయెరుంగని ధర్మములు గలవా ? ఆ చిన్నది మంటపముపైఁ గూర్చుండియున్నది. తద్గుణంబులు మీమదికి నచ్చినవియేగదా ? పాప మానారీమణి సంసారతాపమునకు వెఱచి మీచరణ సరసిజముల శరణు వేడినది. శరణాగత రక్షణము కడుఁ బుణ్యమని చెప్పుదురు. రండు రండు. నిస్సంగు లేమిచేసినను దోసములేదని యాదిశంకరులే నుడివియున్నారని పల్కుచు చేయిఁబట్టుకొని యా మంటపము దాపునకు లాగికొని వచ్చినది.

స్వయంప్రభ దిగ్గునలేచి నిలువంబడి సిగ్గున దలవాల్చికొనినది. సిగ్గె ------- బాలికలకే మగఁడనిన సిగ్గు గలుగుచుండ నగ్గరిత సిగ్గున కగ్గమగుటం యబ్బురమా? అయ్యోగినియు హేమయుఁ బెండ్లి పెద్దలై చెరియొకరిదెన నిలువంబడి తత్కృత్యంబుల నిర్వర్తింపఁజేసరి. చెలీ ! నన్నేమిచేయు మనెదవు? తపోవిఘ్నుమగుచున్నది. వేగఁబోవలయుఁ జెప్పుమనుటయు నామె నిలు నిలుండు. తొందర పడకుఁడు. రాజపుత్రీ ! యిటురా. చేయి సాచుము. అని చెప్పి తత్కరంబతనిచేఁ బట్టించినది నీవే నా భర్తవు. త్రికరణముల నిన్ను వరించితిని. నన్ను భార్యగా స్వీకరింపుము. అని స్వయంప్రభచేఁ బలికించుచు నొకపుష్పమాలిక యమ్మునితిలకుని మెడలా వైపించినది. పిమ్మట నవరత్నమాలఁ దీసి యయ్యోగిపుంగవుం డయ్యంగన మెడలో వైచి చెలీ? నీవుచెప్పినపని చేసితి. నిఁక నేను పోవచ్చునా యని పలుకుటయు నామె చెఱగులు ముడివైచి యిరువురకుఁ బుష్పము లందిచ్చినది సిగ్గువిడచి విచ్చలవిడి వా రొండొరుల శిరముపైఁ దలంబ్రాలుగా నా పూ మొగ్గల విరఁజిమ్ముకొనిరి.

పిమ్మట నమ్ముని యందు నిలువక తపంబునకై కోవెలలోని కరిగెను. హేమయు నమ్మా ! యిఁక మేముఁ బోయివత్తుమాయని యడుగ నయ్యోగిని యమ్మా ? అట్లనియెదవేల ? వివాహమైన వెనుక దీక్ష గనుక వధూవరు లేకస్థలమందు మూఁడు రాత్రు లుండవలయు, పిమ్మటఁ పోవచ్చునని చెప్పినది. అప్పుడా హేమ యించుక యాలోచించి దేవీ ! మా రాజపుత్రి మూఁడురాత్రులు నిందుండఁగలదు. నే పోయివచ్చెద. మా యుద్యానవనములో మేమిద్దరము లేనిచోఁ బరిచారికలు శంకింతురు. ఈమె భారమంతయు నీదే సుమీ యని పలుకుచు స్వయంప్రభకు జెప్పవలసిన మాటలం జెప్పి యొప్పించి తా నా యుద్యానవన సౌధమునకుం బోయినది.