అద్వైత శివానందయోగి కథ
45
నాకుఁ గన్యాత్వ విమోచన మగును. తల్లితండ్రు లిందులకు సమ్మతింపరు సుమీ ! వారు చక్రవర్తి కుమారున కిత్తుమందురు. అందులకు నా డెందమొల్లదు. ఇది రహస్యముగానే జరుపనగుఁ దగినయత్నము గావింపుమని చెప్పినది.
ఆమాట యాబోఁటినుండి వెడలినంత, సంతసముఁజెందుచు సుందరీ ! గాంధర్వమునకు విధి యేమియునులేదు. ఒండొరుల వరించుకొనుటయే కల్పము. నేఁడువలె రేపుగూడ మనము గూఢముగాఁ బోవుదము. వెంటనే యతండు నీ పాణిగ్రహణముఁజేసి నీకన్నెరికము వాయఁ జేయఁగలడు. ఇదియ సన్నాహమని పలికినది అప్పుడు రాజపుత్రి క్రొత్తసంకల్పములు మనంబునం బొడమిన హేమా ! అమ్మహర్షి కుమారుడు నాపాణిగ్రహణము సేయుటకు సమ్మతించునా సమ్మతించునుబో ! పిమ్మట మనమేమి చేయఁదగినది? జహవల్కముల ధరించి మాయనచెంత నెప్పటి నుండి వసింపవలెను? అతం డెందేనిఁ బోయిన మనముగూడఁ బోవలయునా ? వద్దు. వద్దు. ఇందే మునివృత్తిఁ దపముఁ జేసికొనుచుండుము. పెండ్లి యాడుమని యిఁక నా తలిదండ్రులు నిర్బంధించరుగదా? అని వివాహానంతరముఁ జేయదగిన కృత్యములఁ గూర్చి వితర్కింపుచుండ హేమ నవ్వుచు జవ్వనీ ! అనంతర మంతయు నతనే బోధింపఁగలడు. ఇప్పుడు తొందరపడయెక నేమిటికని పలికిన నులికిపడుచు నప్పడుచు అతను డంటివేమిటికి? అతనుఁ డెవ్వడన నోహో ! ప్రమాదమున నతఁడనఁబోయి యతనుఁ డంటి నతనుఁడన మదనుఁడు కాఁడు. గొప్పవాడనియుం జెప్పనొప్పు. తెలిసినదా యని పలికినది.
ఈరీతి నా యిరువురు నారాత్రి సంభాషించుచుండగనే కోడికూత వినబడినది. అప్పుడు హేమ తొందరపడి యా సుందరిని మంగళస్నానముఁ జేయించి నూత్నాంబర మాల్యానులేపనాద్య లంకారములఁ బెండ్లి కూతుంజేసి యందల మెక్కించి యతిరహస్యముగ సూర్యోదయము కాకమున్న యన్న గరకందరమునకుఁ దీసికొని పోయినది. అయ్యిందువదన దూరమునంద యందలము దిగి ముందుగా నందలి విశేషములఁ దెలిసికొని రమ్మని హేమ నంపుటయు నా మచ్చకంటి మంటపము దాపునకుఁ బోవుడు యోగిని యెదురువచ్చి నీ నెచ్చెలి వచ్చినదియా ? నీమాట కనుమోదించినదా యని యడిగిన నమ్మా ! మీయాజ్ఞ కన్యధాత్వమేల, పెండ్లికూతుఁ జేసియే తీసికొనివచ్చితిని. అయ్యగారు సమ్మతించినవార్త వినవలసియున్నదని పలికినది.
నీమాట నీవు చెల్లించికొంటివి. నామాట నేనేల రిత్తఁబుచ్చుదాన నెట్లో బ్రతిమాలి యంగీకరింపఁ జేసెద. నమ్మగువ నిమ్మంటపములోఁ గూర్చుండఁ బెట్టుము. ఇది కళ్యాణమంటపము. అమ్మునికుమారు నిచ్చటికి తీసికొనివత్తు. దేవునిసాక్షిగా వీరిరువురకుఁ బరిణయము జరుగుఁ గావుత మని చెప్పినది. అప్పుడు హేమ పోయి స్వయంప్రభను తీసికొనివచ్చి మంటపములోఁ గూర్చండఁ బెట్టినది.