44
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
వరింతునని చెప్పిన దప్పా! చెప్పుడు. మీకుఁబత్నియైన పిమ్మట నన్ని మంత్రము లుపదేశింపవచ్చును. పార్వతికిఁ బరమేశ్వరుండు తారక ముపదేశింపలేదా? ఈ మాటలకేమి చెప్పుదురని నిర్బంధించి యడిగితిని. నా కేమియు నుత్తరము చెప్పక యవ్వలికిఁ బొమ్మని సంజ్ఞజేసి కన్నులుమూసుకొనిరి. పిమ్మట నే నిచ్చటికి వచ్చితిని. అని చెప్పిన సంతసించుచు నే నిట్లంటిని.
అమ్మా ! నీ కాయనయొద్ద చనువు గనుక నిట్టిమాట యడిగితివి. మే మనగలమా ? నా సఖురాలియెడఁ గల కనికర మంతయుఁ జూపితివి. ఆ విషయ మిదివరకే నాహృదయంబునం బొడమియున్నది. అమ్మహాత్ముఁ డంగీకరించిన స్వయంప్రభ లోపాముద్రాది మహాప్రతివ్రతా సంఘములోఁ జేరునుగదా! ఆ ముని కుమారుండు రూపంబునఁ గంతు వసంతాదుల మించి యున్నవాఁడు లోపమేమి యున్నది. నీమది నకారణముగాఁ బొడమిన సంకల్పము భగవంతుండు సఫలముగాఁ జేయుగాక. అని పలికినది. అప్పు డామె యించుక ధ్యానించి మించుబోణీ ! నీ సఖురాలి యభిమతం బేమో తెలిసికొనిరమ్ము. పిమ్మట విచారించెద ననుటయు. అమ్మా ! మా సఖురాలు నీయాజ్ఞఁ దాటునదికాదు. అందులకు సందియమా? విషయాసక్తుల వరించు విషయము సంశయించుచున్నది. నిస్సంగులననిన యనుమతింపక మానదని పలికితిని.
ఆమె బోటీ ! స్వవచనవ్యాఘాతమున కమ్మహాత్ముండు వెరువక మానఁడు. అతి దయాళుండగు దీనుల మొఱ నాలించును. ఇందులకు వచ్చిన లోపము లేదుగదా! ఇరువురును విరక్తులే ! మణికనకములకుఁ బోలె నొండొరుల సంఘటనంబనకు వన్నె హెచ్చగలదు. ఆ యోగివరు నే నెట్లో సమాధానము పరచెదను. నీవుపోయి నీ సఖురాలి నెల్లి తీసికొనిరమ్ము. గాంధర్వవిధి నిరువురకుఁ బెండ్లి గావింతుమని పలుకుచు నయ్యోగిని లోపలకుఁ బోయినది. నే నామె యనుమతిఁ బడసి యిక్కడకు వచ్చితిని. తరువాత కృత్యమునకు నీవే ప్రమాణమని పలికి యూరకొన్నది.
అప్పుడాచిన్నది కన్నులు మూసికొని రెండుగడియలు ధ్యానించి తలయెత్తి హేమంజూచుచు సఖీ ! ఈ కృత్యము కర్తవ్యమని నీకుఁ దోచినదా? యని యడిగినది. చాలు చాలు. అతం డంగీకరించునా లేదా యని విచారింపక కర్తవ్యమా యని యడుగుచుంటివా? ఆహా ! ఏమి ! నీ మోహము ? ఆ మహానుభావుండు నీ చెట్ట పట్టిన నీపాటిబోటి యేలోకమునందైన గలిగియుండునా ? అప్పుడుగదా నీ నీమమునకు ఫలము ! నాఁడుగదా నీవు ధన్యురాల వగుటయని హేమ బోధించినది.
స్వయంప్రభ దీర్ఘవిశ్వాసపూర్వకముగా హేమా ! నీమాట కాదననేల? నీకిది యుచితమని తోచినచో నట్లే కావింపుము. విధి పరిపాక మెట్లున్నదో యెవ్వరు సెప్పఁగలరు పోనిమ్ము. ఆ మహాత్మునికి శుశ్రూష జేయుచుఁ గృతార్ధురాల నగుదుంగాక. అతండు విరక్తుఁడు గావునఁ దుచ్ఛభోగముల కాసక్తుడుకాడు.