పుట:కాశీమజిలీకథలు-06.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అద్వైత శివానందయోగి కథ

43

చ. అదుణగభస్తి రోచులకు నల్లనవిచ్చెడు తమ్ములట్లు త
    త్పరసిజపత్ర నేత్ర తన సన్నిధి నున్నది యన్నయంత న
    చ్చెరువుగఁ గన్నుదోయి వికసింపఁ గనుంగొనె నాతపస్వి సుం
    దరిపరిధాన దివ్యమణిదామల సత్ప్రభ నాస్వయంప్రభన్.

దివ్యరూపంబునం ప్రకాశించుచున్న యత్తాపసోత్తమునిం జూచి యా చిగరుబోఁణి వెఱఁగుపడుచు క్రొందమ్మిణ, గమ్ము తుమ్మెదలట్ల ఫాలమునం గ్రాలు ముంగుఁరుల గరంబున సవరించు గొమ్ముడి వీపునవ్రేలాడ నా చేడియ రెండు చేతులు జోడించి యమ్మహాత్ముని పాదంబుంబడి నమస్కరించినది.

అప్పు డతం డవ్వాల్గంటిని గ్రీగంటం జూచుచు మేనఁ బులక లుద్భవిల్ల మెల్లన నప్పల్లవపాణి పాణింబట్టి యెత్తి ముద్దు వెట్టుకొనియెను. పిమ్మట నయ్యోగినియు రాజపు త్రికచేయిఁ బట్టుకొని సుందరీ ! మనమింక నిందుండరాదు. అవ్వలఁ బోదము రమ్మని పలుకుచు నచ్చేడియను మంటప సమీపమునకు దీసికొని పోయి యాహా ఏమి నీ అదృష్టము కన్నెత్తియైన నెవ్వరిం జూడని యిమ్మహాత్ముండు నిన్ను లేవనెత్తి చేయి ముద్దుపెట్టుకొనియెను. ఇదియే శుభసూచకము. ప్రొద్దెక్కినది గావున నిఁక నీ వింటికిం బోవచ్చును. హేమకుఁ బ్రసాదమిచ్చి వెనుక నం పెదము. ఈ మణిహారము నాయన నడిగి రేపు నీయొద్ద కంపఁగలదాననని యేమేమో చెప్పి యప్పొలతుక సంతసముఁ గలుగఁజేసినది. రాజపుత్రికయు హేమతో రహస్యముగా మరికొన్ని విశేషములం దెలిసికొని రమ్మని చెప్పి యప్పుడే యందలమెక్కి యొరులెరుంగకుండ నంతఃపురంబున కరిగినది.

ఆ సాయంకాలమునకే హేమ స్వయంప్రభను గలిసికొసినది. స్వయంప్రభయు హేమం జూచి చిగురుఁబోడీ! నేను వచ్చిన తరువాత నచ్చట నేమి జరిగినది? నీవా మహాత్మునిం జూచితివా ? మరల నా ప్రశంస యేమైనం దెచ్చినా? యని యడిగిన నప్పరిచారిక యిట్లనియె దేవీ! మహాత్ములు కడు దయాహృదయులు గదా ! నీవు వచ్చినపిమ్మట నయ్యోగి మరలఁ గన్నులు మూసికొని జపముఁ జేసి కొనలేదు. ఆ గుడిలోఁ గూర్చుండి వా రిరువురు పెద్దతడ వేదియో మాట్లాడికొనిరి. కొంతతరి కత్తలోదరి నాదరి కరుదెంచినది. అమ్మా: నాకుఁ బ్రసాదమిచ్చి యం పెదరా? పోవుదు ననుటయు నా బ్రహ్మచారిణి పోదువుగానిలే? నేను మీపనిమీదనే యుంటిని. ఇంతదనుక నీ సఖురాలి పెండ్లిగురించి ప్రస్తావించితిని. అయ్యతికుమారుండు యువతి పెండ్లియాడక తీరదని రూఢిగా నుడివెను. మహాత్మా ! ఆచిన్నది మిక్కిలి విరక్తిఁజెందియున్నది. విషయాసక్తులం బెండ్లియాడనొల్లదు. మీవంటి విరాగుల వరింపగలదు. అట్టివారెట్లు లభింతురు. మీరు వెనుక నాతోఁబరోపకారులైన మహర్షుల -------------- బరిగ్రహింతురని చెప్పితిరి. మీవలన మంత్రోపదేశముఁ బొందితికాని ------------------- మిమ్మేమనుటకు వీలుపడినదికాదు. ఇప్పుడా పెదలి మిమ్ము