Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

ననుసరించి నేనొకరితన తిరుగుచుంటి. నాకంటె నీసఖురాలియోగికినచ్చిన మచ్చకంటియని తోచుచున్నది ఇదియే మావృత్తాంతము. ఇంతకన్నఁ జెప్పఁదగినది నీవు వినదగినదియును లేదు. స్వయంప్రభను జాలచాల నడిగితిననిచెప్పు మిఁక బొమ్ము. అయ్యగారు పిలుచువేళయైనదని పలుకుచు నయ్యోగిని నాకనుజ్ఞ యిచ్చి వెండియు నామంటపము దాపునకుఁబోయినది. నేనింటికివచ్చితి నివియే యచ్చటి విశేషములని చెప్పినది.

ఆ వృత్తాంతమంతయు విని యక్కాంతారత్నము అమృతహ్రదంబున మునిగినట్లు సంతసించుచు సఖీ! తపఁ పభావమెట్టిదో తెలిసికొంటివిగదా ? ఎట్టి సార్వభౌముండైన నమ్మహాత్ముని పాద రేణువునకు సాటివచ్చునా? అందులకే నేను దపంబు తపంబని పరితపించుచున్నదాన ఆ గుట్టుతెలియక నన్నూరక మీరు రట్టుసేయుచున్నారు. అయ్యోగిని కడుఁ బుణ్యాత్మురాలుగదా! అమ్మహాభాగుని సేవఁ జేసి కృతార్థురాలగుచున్నది. అయ్యో ! ఆ చిన్నది నాతో మైత్రిచేయుదునని చెప్పి యున్నదిగదా యిచ్చటికేమిటికి రమ్మంటివిగావు. మరియు నాశుశ్రూష నాతండంగీకరించు విషయమై యేమియునడిగితివి కావేమి? ఈ రెండుపనులు కొంత చేసికొనివచ్చితివని యాక్షేపించిన హేమ యిట్లనియె.

సఖీ! నేనంత యెఱుంగనిదాననుగాను. ఆమెను మన యింటికి రమ్మనుట లాఘవముగాదా ? మనమే యామెదర్శనమునకుఁ బోవలయును. ఆ యోగివరుండు నిన్నుఁ బెద్దగా మెచ్చికొనుచుండ నీశుశ్రూషకేల యంగీకరింపఁడు. నేనేమియు నడుగకమున్నే నీ సుగుణములన్నియు నెఱిఁగినట్లు వక్కాణించెనే? అతని తపఁప్రభావ మనన్య సామాన్యమైనదని పొగడినది.

అప్పుడు స్వయంప్రభ సంజాతసంభ్రమయై యించుక యాలోచించి హేమా ! నేనొకసారి యమ్మహాత్ముని దర్శనముచేసి రావలయు నిందుల కుపాయముఁ జెప్పుము. దేవతాముని దర్శనంబుల కరుగునప్పుడు వాహనంబుల నెక్కి పోరాదు. అగ్గిరి యెంతదూరమున్నది. మనము పోయిన విని మనవారు మందలింతురా ? యేమనియెదవని యడిగిన నప్పరిచారిక విచారించి ముదితా! నీవిదివఱ కిల్లు వెడలిన దానవు కావు. పెద్దలయాజ్ఞలేక యందుఁ బోరాదు. అక్కొండ దవ్వుగా నున్నది. నడచిపోవుట కష్టము. అని చెప్పినది.

ఆమాటలు సమ్మతింపక మహాత్ముల దర్శనంబున కరుగునప్పుడు పెద్దల యాజ్ఞ యవసరము లేదు. నడువలేకున్న గూఢముగా యానం బమరింపుము. నేనెట్లయిన నమ్మహాత్మునిఁ జూడకమానను. నీవిందులకు సహకారిణివైనచో మిక్కిలిపుణ్యము రాగలదు. అని బెద్దగా స్తుతిఁజేసి దాని నప్పనికిఁ బూనుకొను నట్లొడంబరచినది. మఱునాఁ డరుణోదయమున నమ్మహాత్ముని దర్శించుటకు నిశ్చయించుకొనినవారుగావున నాఁటి రాత్రియెల్లఁబయనము సవరించుకొని వేకువజామున స్నానముఁజేసి పీతాంబర