332
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
అని నిందించుటయు యజ్ఞశర్మ పో పొమ్ము. నే నింతకన్న సంపాదింప లేను. చెడుదానములం గ్రహించి సంపదలచేఁ గులుకుచు నానక యమునిసమ్మెట పోటు లెవ్వరు పడగలరు? నీ యిష్టము వచ్చినట్లు చేయుము. నా కగ్ని దేవతయే శరణమని పలుకుచు స్నానముఁజేసి దేవతార్చన గావించిన పిమ్మట వైశ్వదేవమునకై ధార్యమను నగ్నికుండమును సవరించెను.
అంతకుమున్ను సోమిదేవిచే విసరి పారవైచిన పదారుడబ్బులు నా ధార్యములోఁ బడినవి. ఆ ధార్యమున నగ్గి వెలువరించు సమయంబున నందున్న రాగి నాణెములు అంగారక భ్రాంతి గలుగఁ జేయుచు బంగారు ముద్రలై మెరయుచున్న యవి. ఆ జన్నిగట్టు వానిం బట్టిగొని చూచి లెక్కింప యోహో ? ఈ బంగారు ముద్రల నిందెవ్వరిడిరి ? ఇది కడుచోద్యము. నాకు భోజుండిచ్చిన డబ్బు లిట్లయినవియా ? అవును సత్యమే లెక్కింపఁ బదారే యున్నవి. ఔరా ! శ్రోత్రియద్రవ్యము సత్పాత్రయం దుపయోగింపఁ బడిన సుక్షేత్రంబున నాటిన మంచి విత్తనమువలె బంగారమై ఫలించునని శాస్త్రములు చెప్పుచున్నవి. ఆహా ! ఆ మహారాజు నా నిమిత్తమై కూలిపనిచేసి సంపాదించి తెచ్చిన విత్తమూరక పోవునా? భళిరా ! ద్రవ్యశుద్ది అని యుబ్బుచు నా శ్రోత్రియుఁడు కళత్రమును బిలిచి యా చక్కానముద్రికలం జేతికందిచ్చి యివి యేమియో చెప్పుకొనుమని యడిగెను.
ఆవిడ వానింజూచి తలయూచుచు భోజుఁడు మీ కిచ్చిన వీనిం దాచి తెచ్చితిరి కాబోలు. ఇవి మీ చేతఁ బడి లోష్టములుగాక యట్లే యున్నవేమి ? అని పరిహసించిన నా భూసురుండు నవ్వుచు డిట్లనియె. సోమిదేవీ ! నీవు మంచి చెడ్డలు విమర్మింపక న న్నూరక నిందించుచున్నావు నీ మాటలు విని నేను జెడుత్రోవం బోవలసినదియా ? దుష్టక్రియోపార్జింతంబైన విత్తం బనల్పమైనను జిరకాలము నిలువనేరదు. సన్మార్గంబున లభించిన సొమ్ము అలంతియైనను నక్షయంబై యుండును. దానమునకు ద్రవ్యశుద్ధియుఁ బాత్రశుద్దియుఁ గలిగినేని నణువుమేరువై ప్రకాశించును. ఇవి యిందాక నేఁ దెచ్చినవియే. దాతృప్రతిగ్రహీతల నైర్మల్యంబునంజేసి రాగినాణెములు కనకము లైనవి. చూచుకొమ్మని చెప్పిన నమ్మక యా యిల్లాలు బాపురే ? న న్నెంత మోసము జేయుచుండిరి. చాటుగ వీనిం దెచ్చి ధార్యములోఁ గుక్కి వెక్కిరించుచున్నారా ? పోనిండు ఎట్లయిననేమి ? కొన్నిదినములు కాలముఁ గడపుకొనవచ్చునని చెప్పి వానిం బుచ్చికొని వానిలో నొకముద్రిక ఖండించి కొంచెము కాంచనం బమ్మి కావలసిన పదార్దములఁ దెప్పించుకొని నాఁడు సుఖముగాఁ గడిపినది. మరునాఁ డేదియో కావలసిన యా కాంచన ముద్రికలలోఁ దొలినాడు ఖండతమైన ముద్రికయేది యని వెదకగా నన్నియు నేకరీతిగానే యున్నవి లెక్కకు సరిపడినవి.