Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యజ్ఞశర్మ కథ

331

నమస్కరింపుచు బోజుండు తన రెండు కరంబులు చూపి మహాత్మా ! నీవు నన్నిట్లు బాధ పెట్టుటకిట్టి కోరిక కోరితివి. కష్టపడి నే నెంత ద్రవ్యము సంపాదింపగలనుఁ రాత్రి యెల్ల సమ్మెట బాదితిని. పదారు డబ్బులనిచ్చిరి. అత్యల్ప మైన యీ ద్రవ్యము మీ కిచ్చుటకు సిగ్గగు చున్నది. మీ కిది యొక పూటకైన జాలదు. మీరు నన్నాశ్రయించియు దరిద్రపీడితులై యన్నారని నా మనసు మిక్కిలి పరితపించుచున్నది. మీకుఁ బెక్కులు వందనములు చేయుదును. ఈ కట్టడి విడిచి రాజకీయ ద్రవ్యము తీసికొని పొండు. దాన యావజ్జీవము సుఖింపుదురుగాక అని సానునయముగాఁ బ్రార్థించిన నా విప్రుఁ డిట్లనియె.

దేవా ! నాకు సగముకాలము గతించినది. ఇప్పటికిఁ బ్రతిగ్రహము జేసి యెరుఁగను. భార్యాపుత్రుల యిబ్బందిమూలమున నిందులకు సిద్ధపడవలసి వచ్చినది. అదియే నాకుఁ బదివేలు. పాపద్రవ్య పరిగ్రహణము సేయజాలను. నా నిమిత్తము మీరు చాల శ్రమపడితిరి. అయ్యో? కిసలయ కోమలములగు మీ కరతలములు దారుణ ప్రణాంకితములై యున్నవి. ఈ పాడు పొట్టకై మిమ్మింత కష్టపెట్టిన నా పాతకమున కంతముఁ గలదా? సీ ! నేను వట్టి మూర్ఖుఁడ. నే నిన్నాళ్ళుఁ గడపి యిప్పుడువచ్చి నిర్భంధింపవలయునా ? పాపము ! మీరు రాత్రి యెల్ల నిద్ర మాని పడరాని మాటలం బడుచుఁ గూలిపని చేసితిరిగదా ! అయ్యారే ! మీ యౌదార్యము వేనోళ్ళ గొనియాడఁ దగియున్నది. దీన మీకు నధిక పుణ్యము కలదు. నాకు మహా పాతకము కలదు. అని విచారించుచున్న యా జన్నిగట్టు నూరడింపుచు బోజనృపాలుం డా డబ్బులిచ్చి సాష్టాంగ నమస్కారములు గావించెను. యజ్ఞశర్మ నిర్మలమైన మనసుతో నా వసుమతీపతి నాశీర్వదించుచు నా రొక్కము మూటఁ గట్టికొని తన యింటికిం బోయెను.

సోమిదేవియు భర్త కెదురువోయి బండ్లా ? గుర్రములా ? యేనుగులా ? దేనిమీద ద్రవ్యముఁ దెచ్చుచున్నారు. ఎంత సొమ్మిచ్చెనని యడిగిన నవ్వుచు నా పాఱఁడు ఆ పాడుద్రవ్యము నేను భరింపలేను. రాజునకుఁ దన కష్టార్జితమైన రొక్క మిచ్చె. నిదిగో పుచ్చుకొనుమని మూట విప్పి యా డబ్బులు భార్యచేతిలో వై చెను.

ఆమె వానిం జూచికొని కోపముతో నగ్నిహోత్రగృహములోఁ బారవైచి‌ -

ఉ. అక్షరలక్షలిచ్చి ప్రియమారఁ గవీంద్రులకెల్ల దేవతా
    వృక్షమనంగఁ గోర్కె లొదవించుచు నర్దులఁ బ్రోచునట్టి భో
    జక్షితినేత మీ‌ కకట? చాలినవిత్త మొసంగలేక యీ
    భిక్షము వెట్టె మీ కిఁకఁ గుబేరునిచేరిన నబ్బునే సిరుల్‌.