Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

328

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

దొరకున్నది. నే నేమి చేయుదును? క్షణభంగురమైన శరీరమును బోషించుకొనుటకై దుష్టమార్గము నవలంబింపనా ? రాజు విత్తములు క్రూరక్రియార్జితములు. పాపద్రవ్య పరిగ్రహణంబున మిగుల పాతకమని శాస్త్రములు ఘోషించుచున్నవి. అట్టి రాజ ద్రవ్యము పరిగ్రహించి యస్థిరమైన నీ శరీరమును బోషించుకొని స్థిరపదవిని బోగొట్టుకొనఁ జాలను ఎట్లో కన్నులు మూసికొనిన నాలుగుదినములు గడువకపోవు. ఇన్ని దినములు జరిపిన భగవంతుఁడు పిమ్మట మాత్ర మేల జరుపకుండెడిని. దైవమే యున్నాడు. నన్ను రాజునొద్దకుఁ బొమ్మని వేధింపకు మని బ్రతిమాలిన నా యిల్లా లిట్లనియె.

అగు నగు. నేనుబ్రతిదినము పెక్కుచిక్కులు పడి యిల్లుఁగడుపుచుండ భగవంతుఁడు గడుపుచున్నాఁడని చెప్పుచున్నారా? చాలుఁజాలు. రాజద్రవ్యముఁ దెచ్చుకొనువా రెల్ల నరకమునకుఁ బోవువారేనా? అట్లయినఁ గ్రొత్తనరక మొకటి కట్టించవలయును. మనరాజునొద్ద ద్రవ్యమును గ్రహింపనివారు లేరు. అప్రయోజకులిట్లే చెప్పుచుందురు. రాజులు యజ్ఞయాగములు చేసి బ్రాహ్మణులకు ధనము బంచి పెట్టిరని‌ పురాణములలో నున్నది. వారందరు దోషులేనా? మీమాట లేమియు నుచితముగా లేవు. ఎక్కుడనో తెచ్చి పెట్టుచుండ నింటిలోఁ గూర్చుండి నీతు లెన్నియేనిఁ జెప్పవచ్చును. ఇంత వేదాంతము గలవారు పెండ్లి యాడఁ గూడదు. పిల్లలఁగన గూడదు. సంసారముఁ జేయుచున్నప్పుడు భార్యాపుత్రులఁ బోషింపలేనివాఁడు మహాపాపుఁడని యున్నది. నేనిట్లే పండుకొని యుండెద. మీ దైవ మెట్లు తెచ్చి పెట్టునో చూచెదం గాకయని యా సోమిదేవి ప్రొయి రాజవేయక యూరక పండుకొన్నది.

అప్పుడు యజ్ఞశర్మ మిక్కిలి పరితపించుచు వోసి నిర్భాగ్యురాలా ? నన్ను రక్కసివలెఁ బీడించు చుంటివికదా ? ఆ పెట్టెలో శాలువ యున్నది. ఇటు తెమ్ము. పోయి వచ్చెదనని దంతములు కొరుకుచుఁ బలికిన నామెలేచియా శాలువఁ దెచ్చియిచ్చినది. అది యజ్ఞశర్మ ముత్తాతది‌. వేయిచ్ఛిద్రములు కలిగి యున్నది. ఎన్నిమడతలు పెట్టినను దూట్లు కప్పబడినవికావు. దానినే బుజముపై వైచికొని విభూతిరేఖను -------- మెఱయుచుం బ్రహ్మదేజంబున నొప్పుచు విధిలేక యెట్టకే భోజనరేంద్రుని యా స్థానమున కరిగెను.


కట్టిన గుడ్డయుఁ గప్పిన పుట్టమునుం జాచి పకపక నవ్వుచు నా విప్రునిజాడ భోజున కెరింగించి తదానతినతని నృపతి మ్రోలకుఁ దీసికొనిపోయిరి. ఆ విప్రశథామణిఁ జూచి బోజుండు విస్మయముతో నమస్కరించి ఆర్యా ! మీదే గ్రామము? ఏ విద్యలం జదివితిరి. మీరు కట్టిన పుట్టంబులఁ జూడ కడు దరిద్రులవలెఁ గనంబడుచున్నారు. మీ దేశమున వదాన్యులు లేరా ? యని యడిగిన నాభూసురుని నాశీర్వచన పురస్సరముగా నిట్లనియె.