పుట:కాశీమజిలీకథలు-06.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యజ్ఞశర్మ కథ

327

అర్జునుండు దివ్యవృక్షములతో నొప్పుచున్న ఖాండవనమును, హనుమఁతుండు స్వర్గతుల్యమైన లంకాపురమును, శంకరుడు సర్వజన సుఖాస్పదుండగు మన్మధుని దహింపఁజేసిరి. సర్వజనతాపకమైన చంద్ర దేవత నెవ్వఁడును గాల్పలేక పోయెను కావున దేవా! నీవు నా దారిద్ర్యమును నీ కట్టెలతోఁ గాల్చివేయుమని తెల్పుటకై యిట్టి కట్టెలం దెచ్బెను. అని కాళిదాసు సవరించి చెప్పెను. బోజుం డాతని సమయస్ఫూర్తికి సంతసించుచుఁ గాళిదాసుం గౌగలించుకొని కవీంద్రా ! యాతని యభిప్రాయ మేమియో నాకుఁ దెలియదు. కాని నీవిట్లు సవరించినందులకుఁ జాల సంతసించితిని అని పలుకుచు నా స్లోకమున కక్షరలక్షలు కానుకగా నిచ్చెను. కాళిదాసా విత్తమంతయుఁ గుంభున కిచ్చి నీ విట్టి బొగ్గులం దెచ్చితి వేమిటికి ? నా కప్పటి కా యుక్తి స్పురింపక పోయినచో జాలయవమానము వచ్చుంగదా. పో పొమ్ము. ఈ సొమ్ముతో సుఖముగా జీవించుమని చెప్పి యావిప్రు నంపివేసెను.

కాళిదాసు అట్టివాండ్రు బెక్కండ్ర కుపకారములు చేయుచు నర్ధికల్పభూజమగు భోజునికన్న నెక్కుడు వాడుక వడ సెను.

అని చెప్పి మణిసిద్ధుం డవ్వలిమజిలీ యందిట్లుఁ జెప్పఁదొడంగెను.

తొంబది యెనుబదవ మజిలి

యజ్ఞశర్మకథ

ఈ నిప్పచ్చరము నేను భరింపలేకుంటి నెన్నినాళ్ళిట్లిబ్బందిపడు చుందును. అయ్యో ? మీతోడివారెల్ల రాజదర్శనముఁజేయచు. గజాశ్వాందోళికాదుల సంపాదించుకొని వచ్చి మిద్దెలును మేడలును గట్టికొని భ్రార్యాపుత్త్రులతో సుఖించుచున్నారు. చదివికొనియు సభకుఁ బోవుట కింత పిరికితన మేమిటికి ? భోజుం డర్దదేవభూజుండై యుండ మనముతక్క నీ వీటిలో బేదరిక మనుభవించు పారులు లేరు. ఎన్నిసారులు చెప్పినను వినిపించుకొన కున్నారు. నేఁడు వండుట కేమియును లేదు. నాయావచ్చక్తి ని బొరుగిండ్లకుఁ దిరిగితిని తవ్వెడుబియ్య మెవ్వరును బదు లిచ్చిరికారు. నూకలు నిమిత్తము తిరిగినను దొరికినవికావు పిల్లలు మలమల మాడుచున్నారు. మీరు సర్వదా అగ్నిని శరణముగా నాశ్రయించుకొని‌ యుందురు. నేఁడు వోయి రాజుగారిం జూచి వచ్చిన నన్న మున్నది. లేకున్న హరివాసరమే యని పలుకుచు ధారానగరంబున సోమిదేవి యగు బ్రాహ్మణి తన భర్తతో నొకనాఁడు ప్రాతఃకాలమున సంభాషించినది.

యజ్ఞశర్మయను పేరుగల యా తపశ్శాలి భార్యమాటలు విని అయ్యో? నీ స్త్రీ బుద్ధివిడిచితివికావు. సకల ధర్మముల నెరింగిన నామానస మకార్య కరణంబునకు