Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

    పుడమిఁ ద్రిమ్మర వేడ్క బొడమిన జడదారి
           యాకృతిం దిరుగు జయంతుఁ డొక్కొ
    అఖిల మండలములఁ కాధిపత్యము సేయ
           నియమమూనిన కళానిధియొ కాక

గీ. కలుగనేర్చెనె యిటువంటి చెలువ మిట్టి
    సుందరం బిట్టి లావణ్య మెందునైన
    కావివల్వ జహకరకములఁదాల్చి
    యుర్విఁదిరిగెదు సామాన్యయోగి కరయ.

అని వర్ణించుచుండ వారించుచు స్వయంప్రభ ఓసీ! తత్ప్రభావముం గొనియాడక సౌందర్యమును వర్ణించెదవేమిటికి? ఆమాట నిన్నెవ్వరడిగిరి? తరువాత కథఁ జెప్పమనుటయు నా హేమ మరల నిట్లనియె తదీయు రూపవిభ్రమవిలాసాదులకు నాశ్చర్యమునొందుచు నేను మెల్లగాఁబోయి యా బాలయోగినిదాపునఁ గూర్చుంటిని. ఆపడఁతి నడుమ నడుమఁ గన్నులందెరచి చూచుచున్నదిగావున నన్నుఁజూచి పూఁబోణీ! నీవెవ్వతెవు? ఏమిటికివచ్పితివని యడిగిన నేను నమస్కరించి ప్రత్యుత్తర మీయబోవునంతలో నత్తాపసకుమారుండు పుండరీకదళంబులం బోలిన తన చక్కని విశాలనేత్రంబులఁదెరచి యపాంగ విలోకనంబుల నన్ను బవిత్రురాలిఁ జేయువాడుబోలెఁ జూచుచు బోటీ! నీవు స్వయంప్రభ సఖురాలవుకావా? నీపేరు హేమకాదా? ఆ చ్చిగురుబోణిపంపునంగాదే నీ విచ్చటికివచ్చితివి? మాకంతయుం దెలిసినదని పలుకుటయు తదీయ దివ్యదృష్టివిశేషంబుల కచ్చెరువందుచు నే నెదుర నిలువంబడి నమస్కరించి స్వామీ! మీరు త్రికాలవేదులు. దూరదృష్టి దూరశ్రవణంబులు మీకు కలవు. మీయొద్ద రహస్యములు దాగునా ? నాసఖురాలి చిత్తనైర్మల్యము నేను వేర మీకు విశదీకరింప నవసరములేదు సర్వము మీరు యెరుంగుదురని సంభ్రమముతోఁ బలికితిని. అప్పుడాయన శిష్యురాలులేని స్వమీ ! మీ రింతలోఁ దపోవిఘ్నము సహించి కాంతాప్రసంగమునకుం బూనుకొననేల ? ఇది కడువిస్మయము గొలుపుచున్నది. పరమార్దోపదేశమునకైన నాకింత సమయ మీయరుగదా ? ఆ రాజపుత్రి మంచిది కాఁబోలునని నుడివిన నజ్జడదారి యిట్లనియె.

సహోదరీ! ఆ రాజపుత్రిక చిత్తశుద్ధి యెట్టిదనుకొంటివి? ఆ వైరాగ్యము, ఆ వేదాంత వార్తాశ్రవణశక్తి, ఆవిషయపరాఙ్ముఖత, ఆ శాంతము మహర్షులకైన లేవని చెప్పవచ్చును. అంతయు నంతద్ధృష్టిం జూచుటంజేసి యింతదనుకఁ దత్ప్రసంగమున కనుమోదించితిని. ఇఁక జాలు పొమ్మనమని పలుకుచు నా యతి తల్ల జుండు వెండియుం గన్నులు మూసికొనియెను.

పిమ్మట నాయోగిని నాచేయి పట్టుకొని దూరముగాఁ దీసికొనిపోయి బాలా! నీసఖురాలి పుణ్యము మిక్కిలి స్తోత్రపాత్రమైయున్నదిగదా! ఆహా! అమ్మహాత్ముడు