పుట:కాశీమజిలీకథలు-06.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అద్వైత శివానందయోగి కథ

35

అత్తపస్వి సత్యవచనుండని నమ్మి నీతలిదండ్రు లానందము జెందుచున్నారు. మన రాజ్యమున కేమియు భయములేదని నీకునుఁ జెప్పుమనిరి. ఇదియే యచ్చటివృత్తాంతమని యా రహస్యమంతయుం జెప్పినది. యోగులనినను తాపసు లనినను యవభూతలనినను నామత్త కాశిని చిత్తము సంతోషాయత్తమగుచుండును. కావున నయ్యోగి మాటఁ దలపెట్టినంత మురియుచు హేమతో తరుణీ ! ఆయోగివరుని చరిత్రము మనము తెలిసికోవలసి యున్నది. ఎంతవాఁడునుగాక యేకాంతోదుదంతంబుల నెరింగినట్లు చెప్పఁగలడా ? వానియందద్భుత సామర్ధ్యంబు లున్నమాట వాస్తవము. కావున నీ వేకాంతముగా నందరిగి యగ్గురువరుని కులశీలనామంబు లెట్టివో తెలిసికొని రమ్ము. అని యనేక ప్రకారముల బ్రతిమాలుకొనినది.

హేమ యామాటవిని నవ్వుచు పొలతీ ! నీధైర్యముకొనియాడఁదగియున్నదిగదా రాజ్యముపోవునని యించుకయు విచారింపవు. యోగులచరిత్రములతో మనకేమిపని యడుగవలసిన మాటలయ్యగారే యడిగి వచ్చిరిగదాయని యేమేమో ప్రతికూలవాక్యములు చెప్పటయు నొప్పుకొనక యప్పడఁతి మహాత్ముల దర్శనంబున ననేక లాభంబులు గలుగును. పోయి చూచి రమ్ము. పోవవేని నాయనయని పలుకుటయుఁ గులుకుచు నప్పొలఁతుక గిరిదుర్గంబున కప్పుడే యరిగి వచ్చినది.

దానిం జూచినతోడనే యా చిగురాకుబోణి మోము వికసింప హర్ష పులకితగాత్రయై మించుబోణీ ! అమ్మహత్ముని దర్శించితివా? ప్రశ్నావకాశ మేమైనం గలిగినదా? అతం డెన్ని యేండ్లవాడు? తపం బెట్టిది. కులశీల నామంబు లెట్టివి? అంతయు సవిస్తరముగా వక్కాణింపుమని యడిగిన నవ్వుమొగముతో నమ్మగువ యిట్లనియె.

అద్వైత శివానందయోగి కథ

బోటీ ! నేఁటియుదయమున నీవిచ్చిన పుష్పోపాయనములుగొని యా కొండదండ కరిగితిని. అమ్మవారి యాలయ ప్రాకారమున నీశాన్యముననున్న కళ్యాణమండపము నడుమఁగూర్చుండియా యోగి జపముఁ జేసికొనుచుండెను. ఆయన ప్రక్కనేఁగూర్చుండి యొక యోగిని తావళముఁ ద్రిప్పుచున్నది. అమ్మకచెల్లా! అమ్మహాత్ముని సౌందర్యము వర్ణింప సహస్రముఖునికి శక్యముకాదుగదా ? అట్టి వానిని సన్యాసిగాఁ జేసిన కమలాసనుని నిందింపక మానరు.

సీ. పగదీర హరునిఁగెల్వఁగ దృఢవ్రతమూని
          తపమొనరించు కందర్పుఁ డొక్కొ
   మరు డెందుధరుకంటి మంటనీల్గ విరక్తి
          సంచార మొనరించు చైత్రుఁ డొక్కా