292
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
సులోచనకథ
కాళిందీనదీతీరంబునఁ బుంజికయను గ్రామంబునఁ బ్రజ్ఞావంతుఁడను బ్రాహ్మణుఁడు సులోచన యను భార్యతో గాపురముఁ జేయుచుండెను. విద్యాగంధ రహితుఁడైన యతనిపేరు నేతిబీరకాయవలె నిరర్థకమై యున్నది. అతనిభార్య సులోచన మనోహర రూపసంపన్న యగుట జూచివారి కా దాంపత్యము వికటముగా నున్నదని తోచక మానదు. సులోచన భర్తయందనురాగము లేనిదైనను నక్కపట మొరులకుఁదెలియనీయక విథిలేక నతినితోఁ గాపురము చేయుచుండెను.
ఒకనాఁడు ప్రొద్దుట నా ముద్దులగుమ్మ బిందె తీసికొని నీటికై యేటి కరిగినది. అప్పుడు మిగుల భాగ్యవంతుడును రూపసంపన్నుఁడగు నొకవర్తకుఁ డెందేనిం బోవుచు దంతధావనమునకై తానెక్కి వచ్చిన గుఱ్ఱమును దీరమున నిలిపి రేవులోనికిం బోయెను. అప్పుడు దైవికముగా సులోచన యొక్కరితయే యా రేవులో నున్నది. ఆ చిన్నదాని రూపమా సార్ధవాహుని హృదయము నాకర్షించినది. ఆ సొగసుగానిం జూచి యా చిగురుబోణి డెందము వికారము నొందినది.
ఇరువుర చూపులను ద్రాళ్ళుఁ జేసి కందర్పుఁడు వారి చిత్తములకు ముడివైచెను. లజ్ఞాభయ సంభ్రమములతో నిద్ధరుఁ దొట్రుపాటుఁ జెందిరి. అప్పుడు వర్తకుఁడు సాహసించి చిగురబోణీ ? నీ వెవ్వని భార్యవు ? నీ పేరేమి? నీ తల్లిదండ్రు లెవరు ? కుసుమకోమలివైన నిన్నిట్టు కష్ట పెట్టుచున్న నీ మగఁ డెంత కఠినుఁడోకదాదా? నేనయైనచో నీ వంటి యందకత్తెను బూవులలోఁ బెట్టుకొని కాపాడక పోవుదునా ? యని పలికిన నగ్గరితసిగ్గు విడిచి లేతనవ్వుతో మేము బ్రాహ్మణులము. నా వల్లభుడు మంగళసూత్రమును గట్టుటచే దేహమునకే వల్లభుడు. మనోవల్లభుడు కాడు. పురాకృత మనుభవింపకఁ దీరదుగదా ? నాకును మీవంటిభర్త దొరికిన నెట్టి వేషమైన వేయగలనని పలికినది. ఆ వర్తకుఁడు బోటీ ? స్వకృతముల నిందింపక పూర్వకృతములని ప్రజ్ఞాహీనులు చెప్పుచుందురు. ఇప్పుడు నీవు నా వెంటరమ్ము. నీ పూర్వకృత మేమి చేయునో చూతము. తెలియక దైవముమీదఁ ద్రోయుచుందురు. మందమతులు సుఖపడ నేరకఁ బ్రారబ్ధమని పలుకుదురు. అట్టివాని నే నేమియు విశ్వసింపను. నన్ను నీవుఁ బెండ్లియాడిన రాజభోగములందఁ గలవు. నీ పూర్వకృతమంతయు బటాపంచలై పోఁగలదు. అందులకు సమ్మతింపక పోవుటయే పూర్వకృతమని చెప్పిన నప్పఁడఁతి యిట్లనియె.
అందులకు నా కేమియు సందియము లేదు. ఇప్పుడు చెప్పిన మాటలు తరువాత నిలవవు. నీ కిష్టమైన నీ భార్యకిష్టమగునా ? నా కేల యాసఁ జూపెదవు. నీ దారిని నీవు బొమ్మని యుత్తరముఁ జెప్పిస నతండు తలోదరీ ? నా భార్య చని పోయినది. క్రమ్మరఁ బెండ్లియాడుటకుఁ దగిన కన్య నరయుటకే పోయితిని.