Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భోజకుమారుని కథ

291

భోజుఁడు - (అదరిపడి లేచి) ఏమిరా ? నన్ను మంచిస్వప్నాంతరమున లేపితిరి. ఆకల మంగళాభిముఖమైనది గదా.

రెండవవాఁడు - మీకు మంగళాభిముఖముగానే యున్నది. మా కమంగళాభి ముఖ మగుచున్నది. చూడుము.

భోజుఁడు - అట్లు వికృతముగా మాట్లాడుచున్నావేమి ? ఏమి యుపద్రవము వచ్చినది ?

ఒకఁడు - కొరవిదయ్యము కొరవిదయ్యము.

భోజుఁడు - ఎక్కడ ? ఎక్కడ ?

ఓకఁడు - అదిగో? ఆ కొమ్మలసందున.

భోజుఁడు - (చూచి వెరఁగుపాటుతో) మూర్ఖులారా ? అది కొరవిదయ్యమని యెట్లు నిశ్చయించితిరి ?

ఒకఁడు - కానిచో నా కాంతి యెట్లు వచ్చినది ?

భోజుఁడు - ఆ తేజము కడు మనోహరముగా నున్నది. కొరవిదయ్యము కాదు.

ఒకఁడు - అప్పుడే వీని కంఠముఁ బట్టుకొన్నదని వీఁడు మొర్రపెట్టు చున్నాఁడే ?

భోజుఁడు - భ్రాంతి యట్లు చేయును. వెరవకుఁడు. అది పిశాచిము కాదు.

రెండవవాఁడు - అమ్మయ్యా ! ఇప్పుడు నాకుఁ గొంచెము మాట వచ్చుచున్నది.

ఒకఁడు - చెడుగా, ఇందాక దయ్యము నా పని పట్టుచున్నదని పిల్లల నా కప్పగించితివి కాదా ! ఇంతలో నెక్కడికిఁ బోయినదిరా ?

రెండవవాఁడు - రాజపుత్రుఁ డది దయ్యము కాదని చెప్పువరకు నా శరీరము నే నెరుఁగను. అది యేమో నాకుఁదెలియదు. నీవు మాత్రము వెరవ లేదేమి?

అని వారిద్దరు పంతము లాడుకొనుచుండ నవ్వుచు భోజుఁడు మూర్ఖులారా ? పిశాచ మనునది యొకటిలేదు. అది భీతివలనను బ్రాంతివలనసు బాధించు చున్నట్లు కనబడును. ఇందుల కొక యితి హాసకముగల దాకర్ణింపుఁడు !