సులోచన కథ
293
ఎందునుం దగినయువతి దొరికినది కాదు. ఈ గంగ సాక్షిగానిన్ను భార్యగాఁ గైకొని నీ వలనం గలిగిన సంతతికే నా యైశ్వర్యమంతయు నిచ్చెద. నా వెంట రమ్మని పలికిన నక్కలికి యుబ్బుచు ననుమోదించినది.
అప్పుడా యొప్పులకుప్పను వర్తకుఁడు తన గుఱ్ఱముపైఁ గూర్చుండఁ బెట్టికొని తనదేశంబునకుఁ బోయెను. మర్యాదకులోబడక స్రీలు విజృభించిరేని నాపు వాఁడెవ్వఁడు ? వా రేగినగడియ కెవ్వఁడో వచ్చి రేవులో బిందెనుమాత్రము జూచి యెవ్వతెయో నీటిలోఁబడి మునిఁగినదని కేకలు వైచెను. ఆ కేకలు విని పెక్కండ్రు ప్రోగుపడిరి.. ఎవ్వరెవ్వరని యడలుచు నిండ్లలోనుండి కొందరు పరుగిడివచ్చిరి. బిందె యెవ్వరిదని పరీక్షించి చూడఁ దొడంగిరి. గృహములయం దాడువాండ్రను వెదకుచుఁ జీరుచు గ్రామస్థులందరు తొందరగాఁ దిరుగుచుండిరి. అప్పుడు బ్రజ్ఞావంతుం డింటను భార్యంగానకఁ బరితపించుచు నేటిదరి కరిగి బిందెం జూచి తనేదే యని తెలిసికొని యురముఁ బాదికొనుచుఁ దనభార్య యిందుఁ బడినది వెదకుఁడని యాప్తులతో మొరవెట్టుకొనియెను. కొందరు గెడలఁబూని నీటిలో దిగి వెదకిరి. ఏ జాడయు దొరికినదికాదు.
రత్నమువంటి వాల్గంటి యట్టి నిర్భాగ్యునికిఁ దక్కునా యనువారును వీనితోఁ గాపురము చేయనేరక బలవంతమున నందుఁదిగిన దేమోయను వారును మంచిగుణవంతు రాలనువారును బ్రజలు గుంపులుగాఁ గూడికొని యా చిన్నదానిం గురించి చెప్పుకొనఁ దొడంగిరి. పిమ్మటఁ బ్రజ్ఞావంతుని బంధువులు వచ్చి విరక్తివచనంబు లుపదేశించి శోకము వాయఁజేసిరి. కొన్నిదినములకుఁ బ్రజ్ఞావంతుఁడు మరియొక కన్నెకం బెండ్లియాడెను. ఆ చిన్నది వేగమే కాపురమునకు వచ్చినది. ఆ యిల్లాలు చూలాలై యొకనాఁడు లేకి వచ్చినంతఁ బొరిగింటి యామె వచ్చి అయ్యో ? నీ సవతి బలవన్మరణము నొంది పిశాచమైనది. దాని భయంబున గర్భవతులు యమునకుఁ బోవుటకు వెరచుచున్నారు. పెక్కండ్రంబట్టికొని పీడించుచున్నది. గర్భములు చెడఁ గొట్టుచున్నది. ఇంటఁ బెద్దవారలెవ్వరును లేరు. సోదెకుఁ బోయి యేమి కావలయునో యడిగి మీదుఁ గట్టుము. ఈ జ్వరము గాలిలక్షణముకాని మరియొకటి కాదని చెప్పినది.
ఆ మాట విని రాధిక మేను ఝల్లుమన నీ వన్నమాట నిజమే. మొన్న నెండవేళ నీటికిఁ బోయితిని. అప్పుడేదియో యావేశించినట్లయినది. నా భర్త నా మాట వినిపించుకొనఁడు. ఇరుగువారు పొరుగువారే నాకుఁ దల్లిదండ్రులు. శకునమునకుఁ బొమ్మని చెప్పుడని బ్రతిమాలి కొనినది. అంతలోఁ బ్రజ్ఞావంతుఁడు వీధి నుండి యింటికి వచ్చెను అతనిం జూచి రాధిక వెక్కి వెక్కి యేడువఁ దొడంగినది. ఏమి యేమని యడుగుటయుఁ బొరుగింటియాపె యాతని నాక్షేపించుచు, దొలిచూలు పడుచు నింటికడ నొంటిగా నుంచుట నీకుఁ దగునా ? ఒక్కరితయ మొన్న నీటి కరి