పుట:కాశీమజిలీకథలు-06.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(5)

స్వయంప్రభా విరక్తి కథ

33

జూచుచు నేదియో కన్ను సన్నఁజేసినది. ఆమెయు హస్త సంజ్ఞచే వారించినది. అప్పుడు వారీచిహ్నము లెరింగి రాజపత్ని యా హార మెందున్నదో తీసికొని రండని తొందరపెట్టినది హేమ తెలతెలఁబోవుచు దేవీ? నీయొద్ద దాచనేల? భర్తృదారిక వీణ విరిగినందులకు చింతించుచు నామండనము వీణావతికిఁ బారితోషికముగా నిచ్చి వేసినది. ఈమె యౌదార్యము సామాన్యమనుకొంటిరా యని యాకథ యంతయుఁ జెప్పినది.

ఆ నుడివిని యప్పడతి యొడలెఱుంగకఁ బెద్ధతడ నెడదనడలుచు నత్తొడవు గొడవ పుడమియొడయని కెరిగింపనందు వెడలి వడివడి తన నెలవున కరిగినది. ఆమె రాకవిని యింద్రమిత్రుడు సుద్ధాంతమున కరిగి కామినీ! ఏమిచేసికొనివచ్చితివి? అమ్మాయి నెమ్మదిగానున్న దియా? నీమాటలేమైనం బాటించినదియా? అని యడిగిన డగ్గుత్తికతో నమ్మత్తకాశిని యమ్మాయియు నామాటయుచక్కగానే యున్నవి. అది యటుండనిండు. కొండొకపండువునకు మీముద్రికా పేటికలోనున్న రత్నమండనము మీరెరుఁగకుండ దీసి యమ్మాయికిచ్చితిని. అది తాను జేసిన యపకృతికి ప్రతీకారముగా వీణావతికి యా హారమిచ్చినదట. ఈ ప్రసంగములో నాగొడవ బయల్పడినది. దానియ దెద్దియో యద్భుత సామర్ధ్యంబున్నదని మీరనినమాట కొంచెము జ్ఞాపకమున్న డదియెట్టిదని యడుగుచుండఁగనే యతం డాహాకారముతో మూర్ఛఁ మునింగెను.

అప్పు డప్పడతి గడగడవడంకుచు నొడయని సేదదేర్చి ప్రాణేశ్వరా ! ఇట్లు మూర్ఛపొయితిరేల? దాన రాఁబోవు ముప్పుడెట్టిది. చెప్పుడు చెప్పుఁడని యడుగుచుండ నిట్టూర్పు నిగుడించుచు సీ! సీ! ఎప్పటికి నీ యాఁడుజాతికి వివేకము కలుగదుగదా? అతిరహస్యవస్తువయని యెరింగియు దానిం బైకిఁ దీసిన నీబుద్ధి మాంద్యత కేమనఁదగినది. అయ్యో! మదీయ సామ్రాజ్యం బన్యాధీనంబగు యోగంబు తటస్థించినది. ఆహా! హా! యని దుఃఖింపుచుండ వారించుచు నమ్మించుబోణి యందలి కారణమేమియో చెప్పమని ప్రార్ధించినది.

ఈరత్నమాల యెవ్వని యధీనమందుండునో యాత డారుమాసములు మించకుండ నీరాజ్యమున కధీశుండగును దానికట్టివరమున్నది ఇందులకే కాదా యా హారము సాముద్రికాపేటికనుంచి ప్రాణపదంబుగ కాపాడుచుంటిని. అని తనపతి వచియించినంత నక్కాంతయుఁ భయాక్రాంతస్వాంతయై విలపింపఁ దొడంగెను.

కొండొకవడికి నొండొరుల నోదార్చికొనిరి. నృపతియునప్పుడు కొల్వుకూటమునకుంబోయి యా రహస్యంబు సెప్పక వేరొకనెపముపన్ని పెద్దవారెరుఁగకుండ స్వయంప్రభను భ్రమపెట్టి వీణావతి రత్నమాల నెత్తుకొని పోయినదని