Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

256

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

మ్రాన్పడి తెల్ల బోయి చూచుచు నవ్వలికిఁ బోయెంగదా ! అవ్విధము తలఁచు కొనిన నా గుండె పగిలిపోవుచున్నది. ఏమి చేయుదును ? అతనిని దేశాంతరము పొమ్మని శాసించితిని. ఈ మాట వినినఁ దల్లిదండ్రు లెంత చింతింతురోయని పరితపించుచున్న వసుంధరు నూరుడించుచుఁ గళావతి యిట్లనియె.

ప్రాణేశ్వరా? మీ హృదయము వెన్నకంటె మృదువైనది. ఇంత పరుసముఁ జెందుట చిత్రమే. కానిండు వాని వెదకి రప్పింపవచ్చును గతమునకు వగచుట యార్యలక్షణము కాదు. మిగిలినది యేమియును లేదు. అని బోధించి యతని వెత కొంత తగ్గించినిది.

మంజరిక యాసంవాద మంతయు జాటున నుండి విని సంతాపముఁ జెందుచుఁ బాటలికయొద్ద కరిగి అత్తా! మనకొంప మునిఁగినది. మనరహన్యము లన్నియు వెల్లడి కాకమానవు. ఘటదత్తుఁడు కళావతి కుమారుఁడు. వానిపెంచుకొన్న తల్లి వచ్చి చెప్పినది. కానిచో వానికంత తేజ మెట్లు కలుగును. మరియు మొన్న వ్రాసిన పత్రిక నా చేతిలిపితో వ్రాసితిని. కళావతి యవ్విషయంబు వితర్కింపక మానదు. ఆ పత్రిక యామెచేత జిక్కినది . దీనిం గురించి పెద్దగా వితర్కములు జరుగును. తీగ తీసిన పొదఁగదలక మానదు. కావున మన మెందేనిఁ బారిపోవుట లెస్స. ఇందుండినఁ బరాభవము జరుగకమానదు. అని యుపదేశించుటయు నదియు భయపడినది. ఇరువురు నాలోచించుకొని యా రాత్రి యెవ్వరికిం జెప్పకుండ నా వీడు వెడలి బహుదేశములు దిరిగిరి. చివరకు గమలాపురంబుఁ జేరి యందు విజయదేవ భూపాలునిభార్య శర్వాణి నాశ్రయించి అమ్మా ! మేము బర్బర దేశాధీశ్వరునిభార్య యిందుమతీదేవి పరిచారికలము ఆమె స్వర్గస్తురాలై నంత జింతించుచు విరక్తిఁజెంది కాశీపురమున కరిగియుదుఁ గొన్నాళ్ళుండి వెండియు దేశమునకుఁ బోవుచున్నారము. తల్లి లేని పుట్టినిల్లువోలె నిందుమతిలేని యా పురమున కరుగుటకు మా మనసు లొల్ల కున్నవి. మే మంతఃపుర పరిచారికులమైరాజ భార్యలయొద్దను రాజపుత్రికయొద్దను నమ్మకముగా నుపచారములు చేయగలము. నీవు గడు దయావతియని వి‌ని నీయొద్ద నూడిగములు సేయుట నుత్సహించుచుంటిమి. మమ్ము నీ‌ బిడ్డల వలెం జూచికొని‌ కాపాడుము. నీమరుగుఁ జొచ్చి దేహయాత్రఁ గావించుకొందుము. మీ పాద సేవయు భగవద్విచారము తప్ప నొండులో మాకుఁ బనిలేదు. అని యత్యంత వినయ విశ్వాసముతోఁ బ్రార్థించిన నాలించి శర్వాణి మిక్కిలి జాలిగలదగుట వారి మాటలనమ్మి తమ్ముఁ బోషించిన యిందుమతీదేవి మరణమునకు విరక్తి జెందిన వారి సుగుణములు గొనియాడుచు వారి సేవకంగీకరించి యప్పుడే వారిద్దరఁ దనపుత్రిక యింద్రదత్త యొద్ద కనిపినది. ఇంద్రదత్తయు వారి మాటలు వారి వినయములు నమ్మికడు నమ్మకమైన వారని నిశ్చయించి తన యొద్ద నుంచుకొని పనులకు నియోగించుచుండెను.