పుట:కాశీమజిలీకథలు-06.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

నాకీస్త్రీలాలసత్వము గలిగినది. ఇది పరిహాసాస్పదము గాకపోదు. విరహసంతాపము క్షణక్షణ మభివృద్ధిఁ జెందుచున్నది. కాలయాపనము సైప. పెండ్లి మాటఁ దల పెట్టి నంతనే గృతాంతచర్యలం గావించు న న్నెలంత తనంత వచ్చి నన్ను వరించునట్లెట్లు ! గావింతువో తెలియకున్నది. ఇది నన్నోదార్చుట కనినమాట కాదుగద? నిజము చెప్పుము. చెప్పుమని యడిగినమాటయే యడుగుచు నున్మత్తుండువోలె ప్రలాపించుచుండ నావేదండగమన యతనికిఁ జేయవలసిన కృత్యము లన్నియు బోధించి యోదార్చినది.

అరువదియవ మజిలీ కథ

స్వయంప్రభావిరక్తి కథ

సాధ్వీ! స్వయంప్రభ చేసినపని వింటివా? వీణావతియను వేశ్యాంగన సంగీతముపాడునపుడు శృంగారశ్లోకములు పాడెనని కోపముతో దానివీణ విరుఁగ ద్రొక్కినదఁట. ఇంత కఠినురాలయ్యెనేమి? దానిబుద్ధి యెట్లుమరల్పుదుము. ఈ వైరాగ్య మెవ్వరుపదేశించిరి. దానిచెంతఁ బెండ్లియనినంత నేయివోసిన యగ్ని జ్వాలవోలెఁ బ్రజ్వరిల్లునఁట యేమి చేయుదుము. అని యింద్రమిత్రుఁ డొకనాఁడు భార్యతోఁ బ్రశంసించెను. ఆమెయు మనోహరా! మీరు విచారింపవలదు. దానికిఁ జిన్నతనము వదలలేదని యిన్నిదినము లుపేక్షించితిని. గట్టిగాఁజెప్పిన వినక యేమి జేయునుఁ రేపువోయి మందలించెదం గాక యని ప్రాణనాధునకు సమాధానముఁ జెప్పి యమ్మరునాఁడు రాజపత్ని స్వయంప్రభయున్న యుద్యానవన సౌధంబున కరిగినది.

అట్టి సమయంబున రాజపుత్రికయు సఖురాలితో నిట్లు సంభాషించుకున్నది.

హేమా! నీ మాటలేమియ నాకు రుచింపపు. పెండ్లి యేమిటికిఁ మన మెంతకాలము బ్రతుకుదుము. మానవశరీరములు జలబుద్బుదములకన్నఁ జంచలము లని యెరుంగవా! బ్రతికియున్న స్వల్పకాలములోఁ దగునీమంబుగలిగి పరము సాదించుకొనవలయుంగదా? పెండ్లియాడిన పిల్లలు కలుగుదురు. వాండ్రవలన మమత్వము పెరుగును. అదియే దుఃఖములకెల్ల మూలకారణము. స్వప్న ప్రాయమైన సంసారమునందు నాకేమియు నభిరుచిలేదు. మహాత్ములతోఁగలిసి తపమొనరించి ముక్తి బొందవలయునని యున్నది. నన్ను బలుమారు పెండ్లిం యని బాధింపకుము. నీపాదంబులకు మ్రొక్కెదనని యుపన్యసించుచుండ తలుపుమాటునుండి యంతయు నాలించి యొక్కింతతడవు విచారించి పదపడి వారియెదుట పడినది.