Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీణావతి కథ

29

వచ్చునా? నీ వతని సుగుణములఁ బెద్దగా నుతియింపుచుందురు. గాన నిన్నడుగుచుంటినని యడిగిన నే నిట్లంటిని.

తండ్రీ ! మీరు వినిన కిం వదంతి యసత్యమైనది సూర్యచంద్రాదులు గతులు దప్పినను దప్పుదురుగాని సహదేవుండు సహజగుణంబుల విడుచువాఁడు గాడు. వీణావతికి నిష్క ములిచ్చిన కారణము వేఱొకటి కలదని యావృత్తాంతమంతయుఁ జెప్పి యతనిమతి మరలించితిని. అప్పుడు మనతల్లి వల్లభునితో నీకు బెండ్లి చేయక యిన్ని దినము లుపేక్షించుట తప్పని పరిహసించినది. వివాహమును గురించి పెద్దగా వారిద్దరకు సంవాధము జరిగినది. వానికిం దగినకన్య లభించిన నేమిటికిఁ బెండ్లియాడడని నేనుఁ జెప్పితిని. అట్టి ప్రయత్నము లిదివరకు పదిసారులు చేసి విసిగి మానివేసితినని యాయన నిన్ను నిందించెను.

వాని కనురూపయగు బోటి దొరికిన బెండ్లి యాడించుట కేనుపూటయని మాట యిచ్చి వచ్చితిని. మన తల్లిదండ్రులకు నీవు పెండ్లి యాడలేదని మిక్కిలి చింతగా నున్నది నీయభిప్రాయము నేను వారి కెరిగించితిని గదా ! దేశాటనము చేసి యైన నిష్టము వచ్చిన కన్యనేరికొని పెండ్లియాడరాదా? యూరక నిందల పాల్పడ నేమిటికి? నీవుకోరిన నే చకోరనయన సమ్మతింపదు. అని పలికిన విని యతండించుక నవ్వు మొగంబుతో నాజవ్వని కిట్లనియె.

సహోదరీ ! నాకుఁ గలిగిన యపనింద విషయమై గలిగిన యనుమానము తండ్రిగారితో వాదముఁ జేసి పాయఁ జేసితివి. నీయాదరము కొనియాడఁ దగినదిగదా? అది అట్లుండె నా పెండ్లి కి పూటకాపువైతివిగదా ! అది చెల్లించుకొనవలయును. వీణావతి యెరిగించిన స్వయంప్రభ వృత్తాంతము నీవును వినియుంటివి. ఆ వాల్గంటి యందు నాడెందము దగుల్కొనినది. మొదటినుండియు వైరాగ్యవతియు రూపవతియు నగు యువతి సతిగా నుండవలయునని నా కభిలాషయుండునది ! ఆగుబంబు లా రమణియందున్నటులఁ దెల్ల మగుచున్నది కావున నీవోపితివేని యా మానినీరత్నమును నాకుఁ బాణిగ్రహణము గావింపుము. నీకన్న నా కాంతరంగితు లన్యులు లేరు. అని ఆత్మాభిలాష నయ్యోషామణితోఁ జెప్పికొనియెను.

అప్పు డప్పూఁబోడి నవ్వుచు అన్నా? ఈ నీ సంకల్పము మొన్న హారము గొనివచ్చినప్పుడే గ్రహించితిని. ఆ జవరాలే నీ కనుకూలయని తలంచితి. ఆ రాచపట్టి యెట్టివైరాగ్యతయైన తనంత వచ్చి నిన్ను వరించునట్లు చేసెద. నాబుద్ధిబలముఁ జూచెదవుగాక. ఉపాయంబునకు సాధ్యముగాని పను లుండునా? నీవు తొలుత నవ్వీటి కరుగుము, అత్తెఱవ చర్యలెల్లఁ బరిశీలించి నాకుఁ దెలియజేయుము. పిమ్మట కర్తవ్య మాలోచించెదముగాక యని యేమేమో చెప్పినది.

అప్పలుకు లమృతబిందువులవలె చెవులకు సోకుటయు నతండుబ్బుచు చెల్లీ నీ బుద్దిబలం


బట్టియే నాగుట్టుఁ జెప్పితిని. స్త్రీలోలురం జూచి పరిహసించువాఁడ.