పుట:కాశీమజిలీకథలు-06.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

వచ్చిన నిక్షేపము తృటిలో నిర్మూలముఁజేసితివి. నీవునాకు కూతుఁరవు గావు యభి యాతినివి. నీవిప్పుడు మరల నతనియొద్దకుఁ బోయి నాతల్లి యొప్పుకొనలేదని చెప్పి హారము దీసికొనిరమ్ము. లేనిచో నిన్నుఁ జంపి నే నురిఁబోసికొనియెదనని బెక్కు నిష్టురము లాడినది.

ఆమాటలు విని నవ్వుచు వీణావతి అమ్మా ! నీవింత తొందరపడియెదవేల? నే నాలోచింపక చేసితి ననుకొంటివా? నీకడుపునంబుట్టి చేతిలోఁ బెరిగిన నాకు వేశ్యా ధర్మములు బోధింపవలయునా? నే చేసినపని మంచిదని విచారించిన నీకే తెలియఁగలదు, కోట్లకొలది వెలఁగల యా హారము పెద్ద లెఱుంగకుండ నారాజపుత్రిక మన కిచ్చినది. గదా? తరువాత నా వార్త తలిదండ్రులకుఁ దెలియక మానదు. కూఁతు మందలింపక మానరు. మనలం బట్టికొనుట కీపాటికిఁ గింకరులం బంపియే యుందురు. అది యంతయుం దెలిసియే మనకు బ్రమాదము వచ్చునని భయముతో నిట్లు చేసితిని. అది తప్పంటివేని యిప్పుడుపోయి యా రవణము దీసికొని వచ్చెద. నతం డీయనివాఁడు కాడు. ఏమనియెదవు? విచారించి నుడువు మనుటయు నా వేశ్యమాత పోనిమ్ము ఏదియో చేసితివిగదా? దాని మరలఁ దిరుగఁ దోడనేల? నీ వాలోచించి నదియుఁ గొంత యుచితముగా నున్నది. అని సమాధానపడి యావారనారి యూరకొనినది.

అని యెరిగించువరకు వేళ యతిక్రమించుటయు మణిసిద్ధుం డవ్వలికథ తరువాతి మజిలీయందిట్లని చెప్పందొడంగెను.

ఏబది తొమ్మిదవ మజిలీ కథ

ఆహా? లోకులెట్టి యక్రమ నిందావ్యాపకులోగదా? మాయన్న యేపాప మెరుఁగనిదే దుర్వ్యాపారియని యపనిందమోపిరి. దుస్సహవాస మెట్టివారికి నపఖ్యాతి మూలకము కాకపోదు. ఈవార్త మాయన్న బెరింగించెదనని తలంచుచు సావిత్రి యొకనాడు సహదేవుని మందిరమున కరిగినది. అప్పు డతండు మంచముపై శయనించి యెద్దియో ధ్యానించుచుండెను. అతనింజూచి యాచిగురుబోణి వెఱఁగుపడుచు అన్నా ! ఇదియేమి? అకారణముగాఁ బండుకొంటివి. తండ్రిగారన్న మాట వింటివా యేమి ? అనుటయు నతం డదరిపడి లేచి తండ్రిగారు నన్నే మనిరి చెప్పుము, చెప్పుము. అని యడిగిన నప్పడఁతి యిట్లనియె.

అన్నా ! మొన్న నీవు మణిహారముంగొని పదివేలనిష్కము లవ్వేశ్యల కిచ్చితివిగదా? ఆయీవి వేఱొకతెఱగునఁదలంచుచు నిన్ను వేశ్యాలోలుండని జనులు నిందించుచుండ తండ్రిగారువిని నన్నుఁబిలిచి నీయన్న నిష్టలు వింటివాయని యడిగిరి. ఆపలుకుల కులికిపడి నే నతండేమిచేసెనో చెప్పుడని యడిగితిని. మొన్న వీణావతియును వేశ్య కొక్కదినమునకే పదివేళ నిష్కము లిచ్చెనట. చక్కనికన్యలఁ దెచ్చిన బెండ్లి యాడక జితేంద్రియుండువోలె నే మేమొ చెప్పి యిప్పుడిట్టి తుచ్చపుంబనులఁ జేయ వచ్చునా? ఇంతలో తనకుఁ గలిగిన పరస్త్రీ పరాజ్ముఖుఁ డనువాడుక చెడఁగొట్టుకొన