Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీణావతి కథ

27

స్తుతియించుచు నా విపంచిం గౌఁగిలించుకొని ముద్దుఁబెట్టుకొని సారెలు సవరించి తీగెలు బిగియించి సీలలు ద్రిప్పి పలికించి మేను పులకించ లేచి యా రాజపుత్రుని పాదములకు సాష్టాంగ నమస్కారములు గావించి తన మెడలోని మణిహారముం దీసి దేవా! నా యావజ్జీవము వీణ పాడినపుడెల్ల దొలుత మీ నామమును స్మరించుచుండెదను. మఱియు నా జ్ఞాపకమునిమిత్త మిదిగో యీ హారమును మీ కిచ్చుచున్నదానఁ గైకొనుఁడని పల్కుటయు మందహాసము సేయుచు నా నృపనందనుం డిట్లనియె.

బోటీ ! మాటవరుస కట్లంటినిగాని యిది మాకుఁ గావలయునా క్షత్రియు లొరులయొద్దఁ గాన్కలు గొందురా? నీ సాహసమునకు సంతసించితిని. నీవే యుంచుకొనుము. ఆ రాజపుత్రిక ప్రీతిగా నీకిచ్చినది. దీనిని నీ వొరులకిత్తువేని యనాదర సూచనగాదా! యని పలికిన నగ్గణిక యిట్లనియె. ఆర్యా ! ఆడితప్పిన దోషముకంటె పరిగ్రహదోషము పెద్దదికాదు. మీరుదీనిం గొనరేని యిరువురము నసత్యవాదుల మగుదుమని యేమేమో చెప్పి పరిగ్రహింపవలయునని బలవంత పెట్టుచుండెను. అతండు వలదని త్రోసివేయుచుండెను. ఆ సంవాదమంతయు విని యతని సహోదరి సావిత్రియను చిన్నది వారికి మధ్యవర్తినియై యిట్లు చెప్పినది.

వీణావతీ! క్షత్రియుడు వేశ్యలవలనఁ గానుకలఁ బరిగ్రహించిన ధర్మవంచన యగును. వేశ్యయుఁ దగని యీవిఁ గావించిన నింద్యురాలగును. దీనికిఁ దగిన వెల యిచ్చి కొనుట కితనియొద్ద సరిపడిన ధనములేదు. కావున నతనియొద్దనున్న ధనమంతయు నీకిచ్చువాఁడు. నీ వీ హార మతని కీయవలయును. ఉచితమ యిచ్చినట్లు సంతసించి యతండది యందు కొనుగాక. దీని నిరువుర శపధములు కొనసాగఁగలవని చెప్పి వా రిరువురను సంతోషపెట్టినది. సహదేవుఁడు తండ్రి తన కావత్సరములో నిచ్చిన పదివేల నిష్కము లప్పుడే యా గణికారత్నమున కిచ్చి యా హారముఁ గైకొనెను.

వీణావతియు నావీణం గైకొని సహదేవుని యనుమతి వడసి ద్రవిణంబుఁ బట్టించుకొని సత్రంబునకుఁబోయి తల్లి కావృత్తాంతమంతయుం జెప్పినది. అవేశ్యమాత పెనుభూతమువలె బొబ్బలిడుచు నోసీ ! దుష్టురాలా! నాతోఁజెప్పక స్వతంత్రురాలవై యామండన మాతనికేమిటికిచ్చితివి? దానివెల మెంతయో నీవెఱుంగుదువా? ఇది యమూల్యమని రాజుపుత్రిక చెప్పినమాట జ్ఞాపక మున్నదియా? ఈముష్టివీణ లేక పోయిన కొదుయేమి? అయ్యో! నేను రాకపోవుటచే నెంతముప్పు దెచ్చి పెట్టితివి? నీవు బోగముదాని కెట్లుపుట్టితివో కాని యొక్క గుణమైన మంచిదికాదు గదా? అతండా వస్తువ వలదని నుడివినతోడనే మెడలో వైచికొని రాక డాంబికఁపుమాట లేమిటి కాడవలయును. నీవు పుట్టినది మొదలు వ్యయమేకాని లాభమేమియు లేదు ధనవంతులఁ సూచి యిచ్చకఁపు వలపులు మరపి బిచ్చగాండ్రఁ జేయుచు ధనమార్జింపక దేశాటనమని పేరుఁజెప్పి యూరకఁ జంపుచుంటివి దొరకిన ముల్లెప్రయాణములకె సరిపడకున్నది దైవికముగా