26
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
లావణ్యమా! కుందనమునకైన నట్టి వన్నె యున్నదియా? ఆహాహా! పరారోహ సౌందర్యమున కవసానమని యూరక పొగడుచుండ నాబోటి మాట కడ్డమువచ్చి య చ్చతురుండు వీణావతీ! ఆ యువతికి పెండ్లింయైనదా? యని యడిగెను.
ఆ జవ్వని నవ్వుచు సుకుమారా! చెప్పెద వినుము. ఇంద్రమిత్రుఁడు పురుషాపత్యరహితుం డగుటంజేసి దౌహిత్రులాభంబున పడయఁగోరి యాపట్టి పుట్టినదిగోలె పరిణయప్రయత్నమేఁ జేయుచుండెను. కాని యామానినీమణి యేమిటికో తొలిప్రాయంబుననే విరక్తిఁజెంది పెండ్లియాడనని నియమముఁ జేసికొనియున్నది. శృంగారరసమనిన విషసదృశముగా నేవగించుకొనియెడు ఆ మించుబోణిని రంజించు కొరకే నన్ను సంగీతము పాడుటకై యా చేడియయొద్ద కనిపిరి. శృంగారరస ప్రదీపములగు శ్లోకములు నే నామెయొద్ద చదివినంత కృతాంతజిహ్వకయుంబోలె నితాంతము లగుచు నప్పుడే నావీణ నడఁగ ద్రొక్కినది. అందులచేఁ బశ్చాత్తాపము నందుచు నీహారము నాకుఁ గానుకగా నిచ్చినదని యా వృత్తాంత మంతయు నామూల చూడముగా వక్కాణించి య క్కుమారుని మోహసముద్రములో ముంచివేసినది.
అప్పుడారాజపుత్రిక చరిత్రము వినినయంత యతని స్వాంతతము భేదించి పంచశరుఁడు లోనం బ్రవేశించెను. ఆ వికారము దెలియనీయక ముదితా! ఏదీ నీవీణ నిటుఁ దెమ్ము. ఎట్లు జరిగినదో చూచెదంగాక యని పలుకుటయు నక్కలికి కులుకుచు తొడుగులూడ్చి యా రెండు బండముల నతనినండ నిడినది. ఆ విన్నాణి వానింగలిపి పరీక్షించి విస్మయ మభినయించుచు నగునగు నా వీణియకు దీనికిం జాలభాగము పోలిక యున్నది. ఇది మంచి విపంచియే యని యిటు నటు త్రిప్పి యోహో అక్కలికి దీని విఁరుగఁ ద్రొక్కిననని యూరక నిందించితివిగాదా? ఇది విరుగలేదు. నడుమ నదురుఁ గలిగియున్నది. దానంజేసి మృదుపదాఘాపంబున విడిపోయినది గాని విరుగలేదు. దీని మరల సందించి యధాగధతిం బలికించుజూడ నా కేమి పారితోషిక మిత్తువని యడిగిన నా ప్రోడ యిట్లనియె.
దేవా ! దీనివలన నా కేబహుమానము దొరికినదియో యది మీవరకు సమర్పించుకొనుటయే గాక జీవితాంతముదనుక దాసురాలనై మీ పాదసేవ జేయుచుండెద ననుటయు నతం డాఖండముల రెంటింగైకొని యా వాల్గంటి నింటికిం బంపి వేసెను మఱియు సహదేవుఁడా రాత్రియెల్లఁ బనిఁజేసి కొండొక తుంభీఫలంబు సంఘటించి యతుకులుగలిపి చీలలుబిగించి తీగెలసవరించి మెట్లునమరించి రంగువైచి మెరగుఁదుడిచి తెల్ల వారుసరికి నా వల్లకిని యధాస్థితి నమరించి పలికించుచుండెను.
అంతలో వీణావతి యత్యుత్సవముతో సహదేవుని మందిరమున కరుదెంచెను. అతండు ముదితా ! ఇదిగో నీవీణియ చూఁడమనుచు నయ్యెలనాగ యేదీ? ఇది నావీణయే? నా ప్రాణమే? నా పుత్రికయే? దీనిం బ్రతికించతిరా? ఔరా? ఏమి మీ సామర్త్యము! ఆయ్యారే! ఏమి మీ నైపుణ్యము అని యనేక ప్రకారంబుల.