254
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
లోనగు వృత్తాంత మంతయు వక్కాణించి దాననే యతనికి ఘటదత్తుఁడని పేరు పెట్టితిమని నుడివినది.
ఆ కథ విని యామధురవాణి విధుర హృదయయై మంజరిక మొగము జూచుచుఁ జేటీ ? అప్పురుషరత్నముంగని పారవైచిన భాగ్యశాలిని యీ ప్రోల నెవ్వతె యున్నది? అందులకుఁగారణ మెయ్యదియై యుండును? ఈమె చెప్పినట్లు మృత్యుఁడైన శిశువు యోగినీవరంబునఁ బతికెనా ? ఊహింపుమని యడిగిన గద్గదికస్వరముతో బమ్మా ! ఆ మాటయే సత్యము కావచ్చును. ఈమె యోగిని చెప్పినట్లు నియమము జరిపినది. దేవతా ప్రసాదంబున నా బాలుండు జీవించె. అందులకే యతండంత వాఁడయ్యెనని యుత్తరముఁ జెప్పినది. ఆ మాట విని కళావతి అయినంగా వచ్చును. మరియు జగన్మోహనాకారంబుగల యా సుకుమారుఁగనిన సుందరి యెవ్వతియో దాని భర్త యెంతవాఁడో తెలిసికొనవలసి యున్నది ? ఆ దివసం బీసతీమణి యెరింగించియే యున్నది గదా. నాఁడు మనయూరఁ బ్రసవమైన వారి పేరులు వ్రాయఁబడియే యుండును. నీవు పురములోని కరిగి యవ్విషయము విమర్శించి రమ్మని నియమించి, శారదతో సాధ్వీ! నే నీ రాత్రి నా భర్తగారి నడిగి ఱేపు మీకు వర్తమాన మంపెదను. మీ రందులకుఁ జింతింపవలసినపని లేదు. ఘటదత్తుఁడు భూ భర్తకుఁ బ్రాణమువంటి వాఁడు. భయము లే దిప్పటికి మీ రింటికిఁ బదుడని సవినయముగా నామెను బంపినది.
పిమ్మట మంజరిక అమ్మా ! ఘటదత్తునిపై నయ్యగారికిఁ దగని కోపము వచ్చినది. మొన్న నూరు వెడలి పొమ్మనిరి. ఈ యుదంతము మీ ఱెఱుంగరు కాబోలునని చెప్పిన నే మేమీ ? ఘటదత్తుని మీదనే యయ్యగారు గినియుట. నే నా మాట నమ్మను. నీవు పరాకుగా వింటివేమో ? అంత యపరాధ మతం డేమి కావించెను. అనుటయు మంజరిక యిట్లనియె.
అమ్మా ! అది యొక్కటే కాదు. వేరొక విశేషము గూడ వినవలసి యున్నది. అయ్యగారు కౌముదియం దలిగి యామె మేడకు పోవుటలేదు. అని చెప్పినఁ గళావతి యదరిపడి వింతలు చెప్పుచుంటివే? ఆమె యేమియపరాధముఁ జేసినదని కోపగించిరి ? విన్న తెరం గెరింగింపుమని యదలించిన నది వెరచుచు అమ్మా? నే నీ కథ యొరులవలన వింటి. అంత లెస్సగాఁ దెలియదు. మీరే యయ్యగారి నడుగుఁడు అని పలికినది.
కళావతి మరియొక రేయి భర్తతోఁ గలసికొని యపగత సుఖుండును సంతోషవిముఖుండునై యుండుటఁ దిలకించి యులికి యులికి పలకరించుచుఁ జేతులు జోడించి మనోహరా! ఘటదత్తుని తల్లి మొన్న నా యొద్దకు వచ్చి తన కుమారుఁడు తమ యింటికి రాలేదని వగచుచు మీ రెక్కడికైనఁ బంపిరేమో యడుగుమని మిక్కిలి దైన్యముతోఁ బ్రార్దించినది వెనుక రీతి నతనిమాట మీరు ప్రస్తాపించుట మానివేసితి