Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మంజరి కథ

253

చెప్పిన‌ మహాప్రసాదమని యర్ఘ్య పాద్యాదులం గొని యది ద్వారదేశమున కెదురు వోయి యందు నిలిచియున్న యొకబ్రాహ్మణిని దర్శించి సబహుమానముగాఁ దీసికొనివచ్చి పీఠంబునం గూర్చుండఁ బెట్టినది.

పిమ్మటఁ గళావతి వచ్చి యామెను నమస్కరింపుచు నర్వా! మీ కాపుర మీపుర మేనా? పేరేమి? భర్తగారు విద్వాంసులగుదురా పిల్ల లెందరు? పార్వతివలెనుంటివి గదా? ఎన్నఁడును మా నగరికి వచ్చితివి కావేమి? అని యతివినయముగా నడిగిన నా విప్రపత్ని యిట్లనియె.

దేవీ ! నా పేరు శారద యండ్రు. మేము మీ పురమే యాశ్రయించుకొని కాపుర ముంటిమి నా భర్త కొంచెముగాఁ జదివికొని యున్నారు మీ యాస్థానమునకు వచ్చునంత సామర్థ్యము లేదు. నాకు లేక లేక యొక్కఁడే కొమరుండు కలిగెను. వానిని మీ భర్తగారే పెంచి పెద్ద వానిం జేసిరి. వాఁడు మీగుణంబులు పొగడుచుండ బలుమారు వింటిని. కాబట్టియే యిట్టి యదృష్ట మనుభవించుచుండి మా వాఁడు కొన్ని దివసములనుండి యింటికి వచ్చుటలేదు. ఎంతపని యున్నను రాత్రియైన వచ్చిచూచి పోవువాఁడు. అతనిజాడఁ దెలియకదండ్రి మిక్కిలి పరితపించుచుఁ దా నిక్కడకు రాలేక నన్నుఁ బోయి యడిగి రమ్మనిపంపిరి. అందులకై వచ్చితిని. దయయుంచి ఘటదత్తు నెందైన బంపిరేమో నీ భర్తగారి నడిగి చెప్పవలయు. నిందులకే నే నిచ్చటికి వచ్చతినని‌ యత్యంత దైన్యముతోఁ బ్రార్దించిన నాలించి యమ్మించుబోణి యబ్బురపాటుతో నిట్లనియె.

ఏమీ? ఘటదత్తుఁడు నీ కుమారుఁడా? ఎంత పుణ్యము చేసికొంటివోకదా? అతండు నీ కడుపునం బుట్టెనా? పెంచుకొంటివా? నిక్కముఁజెప్పుమని యడిగిన నామె నా కడుపుననే పుట్టెనని చెప్పినది. ఆ మాటలో స్వరభేదమరసి యత్తరుణీరత్నము అమ్మా ! నాకడ నసత్యము లాడనేమిటికి? సత్యమే చెప్పరాదా ? ఘటదత్తుఁడు నీ కడుపునం బుట్ట లేదని నేను చాటి చెప్పఁగలను. అని పలికిన నులుకుచు శారద దేవీ? నీకా మాట యెవ్వరు సెప్పిరో చెప్పుము. తరువాత నిజము జెప్పెదను. ఔరా ? ఈ రహస్యము నాకును నాభర్తకుఁగాక బ్రహ్మకుఁ దెలియ దనుకొనుచుంటిమి. నీకెట్లు తెలసినదో చిత్రముగా నున్నదని లఘుహృదయయగు నా విప్రాంగన సూచించిన నవ్వుచుం గళావతి యిట్లనియె.

సాధ్వీ? నీవు నిజముఁ బేర్కొంటివేని పిమ్మట నాకుఁజెప్పిన వారిం జెప్పెద. దీన నీకుఁ దప్పేమి యున్నది? చెప్పుము చెప్పుమని యడిగిన నామె యాకథ యెఁరిగి యున్నదని తలంచి దేవీ! ఎట్లయిన నాకు వచ్చిన కొదువలేదు. అతండు నాకుఁ బెంపుఁడు కొడుకన్న మాటయే కాని కన్న వానియందై న నట్టి ప్రేమలేదు వినుండు. అని తాను యోగినివలన మంత్రోపదేశమై యర్దరాత్రమున స్మశానమున కరుగుటయుఁగుండ యత్తరి యెవ్వతియో వచ్చుటయు దానిం బెదిరించుటయు నందీశిశువు దొరకుటయు