252
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
మంజ :- మొన్న రాజుగారితోఁ గళావతితో నే నా ప్రోలికరిగి నప్పుడు కళానిలయ ననుఁజూచి కోపము సేయుచు నీతోఁ జెప్పినపని యొక్కటియుఁ గొనసాగించితివి కావుగదా యని యాక్షేపించినది.
పాట :- ఏమీ ! అప్పటిపని యెవ్వరియానతి నాచరించితివి. అది మరచినదియా యేమి?
మంజ :- ఆమాటయే నేను ముదలకించుచు అమ్మా ! నీకతంబున శిశుహత్యఁ గావింపలేదా? దైవము మనకు నపకారముఁ గావించెను. దానంజేసి నీకు నా చేసిన యుపకారమేమియు నచ్చినదికాదు. అని పలికితిని.
పాట :- తరువాత.
మంజ :- ఆ మాట నే నెరుంగుదు. నీ తల్లియు నీవును గట్టివారలుగదా ! కౌముదియందు రాజునకు విరోధము కలుగునట్లు చేయలేరాయని యడిగినది.
పొటలిక :- ఏమంటివి ?
మంజ :- అట్లుచేసిన మాకిత్తుమన్న గ్రామములు మూఁడుకు దయ చేయుదురా యని యడుగుటయు వసుంధరునకు కౌముదియందు బ్రబలవిరోధమును బుట్టించి దానింటికిఁ బోకుండఁ జేయుదురేని మీరు కోరిన గ్రామములు తప్పక వ్రాసి యిప్పించు చున్నాను. అని వాగ్దత్తముఁ జేసినది. ఆ మాట విని పరమసంతోషముఁ జెందుచు ఘటదత్తు జూచి కౌముది నవ్వినదని యనుమానముఁ జెంది వసుంధరుఁ డాసంగతి కౌముదిని దరచి తరచి యడిగిన కథ నేను వినియున్నదానఁ గావున నదియే యవకాశము జేసికొని యింటికి వచ్చిన మరునాఁడొక పత్రిక వ్రాసిసి యతఁడు పండుకొను మంచము తలయంపిఁ గ్రుచ్చితిని. అ పత్రికం జదివికొనియే యతండు ఘటదత్తు నూరునుండి లేవఁగొట్టి కౌముదిపై నలిగి యక్కడికిఁ బోవకున్నవాఁడు. నీవడిగితివి కావున రహస్యమైనను నిజము నీకుఁజెప్పితిని. కళావతి యాగొడవ యేమియు నెరుఁగదు. పదిదినములలోఁ గళానిలయ యొద్దకుఁ బోయి కార్య మెరింగించి యాగ్రామములు నీయల్లునిపేర వ్రాయించి పుచ్చుకొనియెద మిదియే యదార్దమని చెప్పినవిని యా పాటలిక మిక్కిలి సంతసించుచు నిట్లనియె.
మంజరికా ! మనము మొదటఁజేసిన కార్యములన్నియు నిష్పలములై నను నీకార్యము కొనసాగినది. నా యల్లునికి వచ్చుటచే నాకు వచ్చునట్లే సంతసించితిని. పోనిమ్ము. నీవై రము చల్లారకుండ వృద్దిఁజేసి నీయం దామెకుఁ గల దయ నిబ్బడింపఁ జేసెదనులేయని తత్కాలోచితముగా సంభాషించు సమయంబున నెవ్వతెయో వచ్చి మంజరికా ! నిన్నమ్మగారు రమ్మనుచున్నారు. వేగము రమ్ము అని పిలిచినది.
అప్పుడు మంజరి అత్తా ! నీ విఁక పొమ్ము. నేను గళావతియొద్ద కరుఁగ వలయునని పలుకుచు లేచి మెల్లన నామె కడకుఁబోయినది. కళావతి మంజరికఁజూచి చేటీ ! ఎవ్వరో ముత్తయిదువ వచ్చినదఁట. ఎదురు పోయి తీసికొనిరా వేగపో ? అని