పుట:కాశీమజిలీకథలు-06.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

236

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

రాత్రులయందు సుమతితోఁ బురాణగాధలఁ ముచ్చటించుచుండును. ఒకనాఁడు పురీ విశేషములం దెలిసికొని వచ్చి సరోజినితో నిట్లనియె.

ఇంద్ర దత్తకథ

కుమారీ ! ఇన్నగరము విజయదేవుఁడను రాజు శర్వాణియను భార్యతోఁ బాలించుచుండెను. అతం డనపత్యుండై పది సంవత్సరములు మహేంద్రయాగంబున శచీపురందుల నారాధించి సకలలోక మోహనరూప విద్యావిశేషంబుల ననవద్య యగు పుత్రికం బడసెనట. అహా ! అతండు త్రిలోకాధిపతియగు నింద్రుని దయకుఁ బాత్రుడైనను బుత్రుంబడయలేకపోయెను. పురాకృతము ననుసరించియే వేల్పులును వరములిత్తురుగదా ? ఇంద్రదత్తయగుట నా మత్తకాశిని కింద్రదత్త యని‌యే పేరుఁబెట్టిరి. ఆ రాజపుత్రిక చిత్రఫలకము నేను చూచితిని. పుడమిఁగల రూపవతులలో నొకదానిగాఁ జెప్పవచ్చును. లావణ్యము మిగుల మెచ్చుకొనఁ దగియున్నది. నలువ యచ్చెలువమొగము తగు ప్రయత్నముతోఁ జేసినట్లు తలంచెదను. నొసటి తీరు, చెక్కులయందము, కనుల సొగసు మనసు నచ్చినవగుట నటనుండి కదలి రానిఁచ్చినవి కావు. అని యూరకఁ బొగడుచుండ నవ్వుచు నా జవ్వని యిట్లనియె.

అన్నా ! నేడు నీ నోటినుండి వింతలు వింటినిగదా? నీ వింతగా నా వాల్గంటిం బొగడుచుంటివేల ? దానిం బెండ్లి యాడవలయునని యభిలాష గలిగినదియా యేమి? సెప్పుమని యడిగిన నతం డిట్లనియె.

దానిచరిత్రము నీవు వినలేదు. అస్థిరయౌవనులగుట మనుష్యులవది పెండ్లి యాడఁదట. కంతుఁడో వసంతుఁడో జయంతుఁడో నలకూబరుఁడో తన్ను వలచివచ్చిన పెండ్లి యాడుదునని చెప్పుచున్నదట. తనరూపమునకుఁ దనవిద్యకు మానసు లన నెంత? దేవదానవగంధర్వాదులయందును సమానులు లేరని గరువముఁ జెందుచుండు నట. తండ్రి వేయి విధంబుల భూలోక చక్రవర్తులం బెండ్లియాడుమని బ్రతిమాలినను వినక వేల్పుల నిమిత్తమై యెదురు చూచుచున్నది. అట్టి రాచపట్టిం జేపట్టుదునని నీతో నెట్లు చెప్పుదును ! అందని ఫలముల కఱ్ఱులు సాచవచ్చునా యని పలికిన నవ్వుచు సరోజిని యిట్లనియె.

అన్నా ! నీ సహోదరిబుద్ధి సామర్థ్య మెరింగి యుండియు నిట్లనవచ్చునా? నీ కట్టి కోరికయే యుండినచో నల్పకాలములో నా ప్రోయాలి నీ పాదముఁ జేర్చెదఁ జూడుము. అనవగత లోకవృత్తియగుట నమ్మగువ యట్లనుచున్నదని చెప్పిన నతం డుబ్బుచు నట్లేని నీ యిష్టము వచ్చినట్లు చేయమని యుత్తర మిచ్చె.